రూ.1,656 కోట్ల భవంతిని కొనుగోలు చేసిన సెలబ్రిటీ జంట

సంగీత రారాణి బియాన్స్‌(American singer Beyonce) మరో రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలోనే అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి.. ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్‌ చేశారు. ఆ ఇంటి ధర తెలిస్తే వామ్మో అనకమానరు..!  

Published : 21 May 2023 01:41 IST

కాలిఫోర్నియా: అమెరికా స్టార్‌ సింగర్స్‌ బియాన్స్‌, ఆమె భర్త ర్యాపర్‌ జే-జెడ్‌(Beyonce and Jay-Z).. కాలిఫోర్నియా (California) కొత్తగా ఓ ఇల్లు కొనుగోలు చేశారు. దాని విలువ అక్షరాలా 200 మిలియన్ల డాలర్లు. అదే మన కరెన్సీలో చూస్తే.. ఆ భవంతి విలువ రూ.1,656 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..

ఇదీ చదవండి: Beyonce : ఆమె పాటకు ‘గ్రామీ’ పట్టాభిషేకం!

బియాన్స్(American singer Beyonce) దంపతులు కొనుగోలు చేసిన ఇల్లు కాలిఫోర్నియాలోని మాలిబు ప్రాంతంలో ఉంది. ఆ రాష్ట్రంలో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆస్తి ఇదే కావడం గమనార్హం. జపనీస్ ఆర్కిటెక్ట్‌ టడావో ఆండో డిజైన్ చేసిన ఈ ఇంటి నుంచి పసిఫిక్ మహా సముద్ర బీచ్‌ అందాలను వీక్షించవచ్చు. 2003లో 14.5 మిలియన్ల డాలర్లు వెచ్చించి, విలియం బెల్ అనే వ్యక్తి దీనిని కొనుగోలు చేశారు. తర్వాత టడావోకు ఇచ్చి, డిజైన్ చేయించారు. ఎల్‌ ఆకారంలో ఉన్న ఈ 30వేల చదరపు అడుగుల భవంతి.. ఇప్పుడు సుమారు 200 మిలియన్ల డాలర్ల ధర పలికింది. 

అంతకు ముందు మాలిబు ప్రాంతంలో 2021లో వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ అండ్రీస్సెన్‌ 177 మిలియన్ల డాలర్లతో ఇంటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ రికార్డును బియాన్స్‌ జంట బ్రేక్ చేసింది. ఇక 2017లో వీరు లాస్‌ఏంజెలెస్‌లో 88 మిలియన్ల డాలర్లు విలువైన బంగ్లాను కొన్నారు. దానిలో మీడియా రూమ్‌, బుల్లెట్‌ ప్రూఫ్ విండోస్‌, టెర్రస్‌లో అదనంగా 10 వేల చదరపు అడుగుల అవుట్‌డోర్‌ లివింగ్ స్పేస్‌ ఉంది. ప్రస్తుతం ఈ ఇంటి విలువ 135 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని