Cluster Bombs: మా నిర్ణయం సరైనదే..! సమర్థించుకున్న బైడెన్‌

ఉక్రెయిన్‌ యుద్ధరంగానికి క్లస్టర్ బాంబులను సరఫరా చేయాలనే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నారు. అయితే, రష్యా దీన్ని ఖండించింది.

Updated : 08 Jul 2023 18:35 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య (Ukraine Crisis) మొదలుపెట్టి 500 రోజులవుతోంది. మొదట్లో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌ (Ukraine).. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో క్రమంగా మాస్కోపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా (America) కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రమాదకర ‘క్లస్టర్‌ బాంబు (Cluster Bombs)’లను అందజేయాలని నిర్ణయించింది. భారీ పౌరనష్టం కలిగించే ఈ ఆయుధాల సరఫరాపై మానవ హక్కుల సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఉక్రెయిన్‌ వద్ద ఆయుధ నిల్వలు నిండుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకునేందుకు తనకు సమయం పట్టిందని పేర్కొంటూ.. దీనిపై మిత్రదేశాలతోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సలీవాన్‌ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. క్లస్టర్‌ బాంబుల తీవ్రత గురించి తమకు తెలుసని.. అందుకే వీలైనంత కాలం ఈ నిర్ణయాన్ని వాయిదా వేశామన్నారు. అయితే, ఉక్రెయిన్‌ వద్ద ఆయుధ సామగ్రి అయిపోతోందని.. యుద్ధ సమయంలో ఆ దేశాన్ని ఆయుధాలు లేని నిస్సహాయ స్థితిలో వదిలేయలేమని చెప్పారు.

ఇవీ చదవండి: రహస్యంగా ఉంచిన రసాయన ఆయుధాల ధ్వంసం

అమెరికా నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమయోచిత చర్యగా పేర్కొనగా.. రష్యా మాత్రం ఖండించింది. అమెరికా తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా.. ఇప్పుడు అమాయక పౌరుల ప్రాణాలకు ఏళ్ల తరబడి ముప్పు పొంచి ఉంటుందని రష్యా విమర్శించింది. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధంలో రష్యా ఇప్పటికే క్లస్టర్‌ బాంబులను ఉపయోగిస్తోన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని