Joe Biden: బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు.. అమెరికాలో కలకలం

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌లోని వాహనాన్ని మరో కారు ఢీకొంది. ఈ ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.

Updated : 18 Dec 2023 10:19 IST

విల్మింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా (USA)లో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్వేతసౌధం తెలిపిన వివరాల ప్రకారం.. అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ (Jill Biden) ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని బైడెన్‌ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి  యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొంది. అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.

ప్రచారంలో వివేక్‌ రామస్వామి దూకుడు

ఆ సమయంలో జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్‌ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు, ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో బైడెన్‌ దంపతులను వెంటనే వైట్‌హౌస్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని