China: శ్రీలంకతో కలిసి చైనా నౌక పరిశోధనలు..!

చైనాకు చెందిన పరిశోధన నౌక షి యాన్‌-6 శ్రీలంక తీరంలో పరిశోధనలు కూడా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగశాఖ ప్రకటించింది. 

Updated : 01 Nov 2023 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలోని కొలంబోలో లంగరేసిన చైనా పరిశోధక నౌక షి యాన్‌-6 కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ నౌక ఇక్కడకు రావడంపై భారత్‌, అమెరికాకు అభ్యంతరాలున్న విషయం తెలిసిందే. ఈ నౌక శ్రీలంకతో కలిసి మెరైన్‌ రీసెర్చి కార్యకలాపాలను చేపట్టినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో చైనాకు చెందిన పరిశోధక నౌకలు భారత్‌కు సమీపంలో ఇటువంటి పరిశోధనలు చేపట్టడం ఇది రెండోసారి. 

మరోవైపు శ్రీలంక విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘అక్టోబర్‌ 30, 31 తేదీల్లో మెరైన్‌ సైంటిఫిక్‌ రిసెర్చి నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నౌక దేశ పశ్చిమ తీరంలోని జలాల్లో ఉందని వెల్లడించారు. ఇక శ్రీలంకలోని నేషనల్‌ ఆక్వాటిక్స్‌ రిసెర్చి, నౌకాదళం, రుహునా యూనివర్శిటీకి చెందిన సిబ్బందిని ఈ నౌకలోకి అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్రీలంక తీర సరిహద్దుల్లో సంయుక్తంగా సర్వే చేయడానికి కూడా ఈ నౌక అనుమతులు కోరినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇది హమాస్‌ ‘క్రూరమైన ప్రచారం’

పరిశోధనల పేరుతో చైనా తరచూ శ్రీలంక జలాల్లోకి తన ఓడలను పంపిస్తోంది. 2014లో చైనా అణు జలాంతర్గామిని లంక తన పోర్టుల్లోకి అనుమతించింది. ఆ సమయంలో భారత్‌, శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తన బాలిస్టిక్‌ క్షిపణి, శాటిలైట్‌ ట్రాకింగ్‌ ఓడ యువాన్‌ వాంగ్‌-5ను శ్రీలంకలోని 2022లో హంబన్‌తోట పోర్టులో వారంపాటు ఉంచింది. అప్పుడూ భారత్‌ అభ్యంతరం తెలిపింది. ఈ నౌక భారత్‌లోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక భాగాలపై నిఘానేత్రం ఉంచగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని