ఇది హమాస్‌ ‘క్రూరమైన ప్రచారం’

తమ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు మహిళల వీడియోను హమాస్‌ విడుదల చేసింది.

Published : 01 Nov 2023 05:17 IST

బందీల వీడియోపై నెతన్యాహు ఆగ్రహం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు మహిళల వీడియోను హమాస్‌ విడుదల చేసింది. అందులో ఓ మహిళ మాట్లాడుతూ.. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. అది హమాస్‌ చేస్తున్న ‘క్రూరమైన ప్రచారం’ అని దుయ్యబట్టారు. హమాస్‌ సోమవారం 76 సెకన్ల నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. గుర్తు తెలియని ప్రదేశంలో ఆ మహిళలు కూర్చుని కనిపించారు. ఓ మహిళ మాట్లాడుతూ.. ‘గత 23 రోజులుగా మేం హమాస్‌వద్ద బందీలుగా ఉన్నాం. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌.. గాజాలో భీకర దాడులు చేస్తోందని మాకు తెలిసింది. అయితే మీ రాజకీయ, భద్రతా కారణాలు, సైనిక వైఫల్యంవల్ల మేం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. మీరు మమ్మల్ని నిజంగా కాపాడాలనుకుంటే వారి (పాలస్తీనా) ఖైదీలను విడిచిపెట్టండి. మమ్మల్ని వీరి చెర నుంచి విడిపించండి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో కాస్తా వైరల్‌ అవడంతో నెతన్యాహు ఓ ప్రకటన విడుదల చేశారు. వీడియోలో ఉన్న మహిళలు యెలేనా ట్రుపనోవ్‌, డేనియల్‌ అలోని, రిమన్‌ క్రిష్ట్‌ అని ఇజ్రాయెల్‌ గుర్తించినట్లు తెలిపారు. ‘మనల్ని మానసికంగా దెబ్బతీసేందుకు హమాస్‌ చేస్తున్న క్రూరమైన ప్రచారం ఇది. మిమ్మల్ని మేం తప్పకుండా కాపాడతాం. అపహరణకు గురైన ప్రతి ఒక్కరినీ విడిపిస్తాం. అదృశ్యమైన వారందరినీ ఇళ్లకు చేరుస్తాం’ అని భరోసా ఇచ్చారు.

‘నెతన్యాహు వైదొలగాలి’

మరింత నష్టం జరగకుండా సాధ్యమైనంత త్వరగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని నెతన్యాహును ఇజ్రాయెల్‌ టెక్నాలజీ కంపెనీల సీఈవోలు డిమాండు చేశారు. హమాస్‌ దాడుల నేపథ్యంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని సూచించారు. వైఫల్యానికి బాధ్యత వహించని నెతన్యాహు రాజీనామా చేయాలని ఇప్పటికే పలు పార్టీల నేతలు డిమాండు చేశారు.

‘సిరియాకు విస్తరించింది’

ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ సిరియాకు విస్తరించిందని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి గెయిర్‌ పెడర్సన్‌ తెలిపారు. 12 ఏళ్లుగా అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న సిరియా మరింత కల్లోలంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో సోమవారం ఆయన మాట్లాడారు. సిరియాకు విస్తరించడం రిస్కే కాదు.. ఇప్పటికే అది మొదలైంది అని పేర్కొన్నారు.


ఎల్లోస్టార్‌ మా గుండెలపైనే..
- ఐరాసలో ఇజ్రాయెల్‌ వెల్లడి

న్యూయార్క్‌: హమాస్‌ మిలిటెంట్లను నాజీ జర్మనీతో పోలుస్తూ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇజ్రాయెల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే ఐరాస భద్రతా మండలిలో ప్రసంగించే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రతినిధులు ఎల్లో స్టార్‌లను తమ చొక్కాలకు ధరించారు. ‘నాజీల ఆధీనంలోని ఆష్విట్జ్‌లో యూదులపై మారణకాండ జరిగినప్పుడు ఈ ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు నాజీ హమాస్‌ అదే పని చేసింది. ఇప్పుడూ ప్రపంచం నిశ్శబ్దంగానే ఉంది. భద్రతా మండలి మౌనం వహిస్తోంది. కొన్ని సభ్య దేశాలు 80 ఏళ్లలో ఏమీ నేర్చుకోలేదు. అసలు ఈ సమితి ఎందుకు ఏర్పడిందో కొందరు మర్చిపోయారు. ఈ రోజు నుంచి మీరు నావైపు చూసినప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తు చేస్తా. దానికోసమే ఈ రోజు నుంచి మా బృందమంతా ఎల్లో స్టార్‌ ధరిస్తుంది. హమాస్‌ దురాగతాలను ఖండించేవరకు, బందీలను విడిపించాలని డిమాండు చేసేవరకు దీనిని మేం ధరిస్తాం’ అని ఐరాసలోని ఇజ్రాయెల్‌ ప్రతినిధి గిలద్‌ ఎర్డన్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని