Corona virus: ఈ దేశాలను కరోనా టచ్‌ కూడా చేయలేదు!

కరోనా కల్లోలం ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది...లక్షల ప్రాణాలు పోయాయి..

Published : 23 Feb 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కల్లోలం ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఈ వైరస్‌ బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇంత ప్రళయంలోనూ నాలుగు దేశాల్ని మాత్రం కొవిడ్‌ కనీసం టచ్‌ కూడా చేయలేకపోయింది. ఐక్యరాజ్యసమితినే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ దేశాలేవంటే? 

ఉత్తర కొరియా

కరోనా విజృంభించకముందే దేశ సరిహద్దులు మూసేసిన తొలి దేశం ఉత్తర కొరియా. కొన్ని దేశాల్లో మూడో వేవ్‌ కూడా వచ్చినా.. ఇక్కడ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటున్నారు అక్కడి అధికారులు. 2020 జనవరిలోనే విదేశీయుల రాకను నిషేధించారు. ఇప్పటికీ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఆ కఠిన ఆంక్షల ఫలితమే అక్కడ జీరో కొవిడ్‌ కేసులు.

తుర్క్‌మెనిస్థాన్‌

మధ్య ఆసియాలోని కీలక దేశం తుర్క్‌మెనిస్థాన్‌. కరోనా విజృంభణ మొదలు కాకముందే భౌతిక దూరం నిబంధనలు కఠినంగా పాటించడం ప్రారంభించారు. చిత్రమైన విషయం ఏంటంటే.. అక్కడ కరోనా వైరస్‌ అనే పదాన్ని కూడా నిషేధించారట. కేసులు నమోదు చేయలేదు. ఫలితంగానే కొవిడ్‌ లేదనే ప్రచారం మొదలైందని విదేశీ మీడియా విమర్శిస్తోంది. దాన్ని కొట్టిపారేస్తూ.. తాము తీసుకున్న కఠిన చర్యలతోనే తమ దేశంలో కరోనా ప్రవేశించలేకపోయిందంటోంది తుర్క్‌మెనిస్థాన్‌.

తువాలు

ప్రపంచంలోని అతి చిన్న, అత్యంత తక్కువ జనాభా ఉండే దేశాల్లో ఒకటి తువాలు. దాంతో కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం అక్కడి ప్రభుత్వానికి తేలికైంది. విదేశాల నుంచి రాకపోకలు నిషేధించడంతో కరోనాని అదుపు చేయగలిగిందీ దేశం.

నౌరూ

విదేశాలతో అతి తక్కువ సంబంధాలుండే చిన్న దేశం నౌరూ. దేశం మొత్తం జనాభా పదకొండు వేలే. ఒక్కరోజులో దేశం మొత్తం చుట్టిరావొచ్చు. సహజంగానే.. ప్రజలందరినీ అదుపు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని