Donald Trump: ‘ట్రంప్‌ నాపై అత్యాచారం చేశారు..’ మాజీ కాలమిస్ట్‌ ఆరోపణ..!

ఓ శృంగార తారతో (Stormy Daniels) అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో ఆయన అరెస్టై విడుదలైన కొన్ని రోజులకే డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోకేసు తెరపైకి వచ్చింది. 1990ల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ (76) తనపై లైంగిక దాడి చేశారంటూ అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కారొల్‌ (79) ఆరోపణలు చేశారు.

Published : 26 Apr 2023 19:54 IST

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) పలు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ శృంగార తారతో (Stormy Daniels) అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో ఆయన అరెస్టై విడుదలైన విషయం తెలిసిందే. ఈ వివాదం ముగియక ముందే 1990ల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ (76) తనపై లైంగిక దాడి చేశారంటూ అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కారొల్‌ (79) చేసిన ఆరోపణల కేసు తెరపైకి వచ్చింది. ఈ సివిల్‌ వివాదానికి సంబంధించి మన్‌హట్టన్‌లోని యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో విచారణ మొదలయ్యింది.

అసలేం జరిగిందంటే..!

‘1996లో మన్‌హట్టన్‌లోని ఫిఫ్త్‌ అవెన్యూలోని ఓ డిపార్టుమెంటల్‌ స్టోర్‌లో కారొల్‌కు ట్రంప్‌ ఎదురయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇచ్చేందుకు తనను సలహా అడిగారు. ట్రంప్‌ సరదాగా అడగడంతో అంగీకరించి.. ఆమె ఆరో ఫ్లోర్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ సెక్షన్‌లో ఎవ్వరూ లేరు. దుస్తులు మార్చుకునే గదిలోకి వచ్చిన ట్రంప్‌ కారొల్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని కారొల్‌ (Jean Carroll) తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ ఘటనతో కారొల్‌ షాక్‌కు గురయ్యానని.. అత్యాచార బాధితురాలిగా తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ పుస్తకంలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఆరోపణలను ట్రంప్‌ తరఫు న్యాయవాది జో టాకోపినా ఖండించారు. ఆమెను ట్రంప్‌ ఎన్నడూ కలవలేదని, ఆమె పూర్తిగా అబద్ధాలు ఆడుతోందన్నారు. కేవలం డబ్బు, పాపులర్‌ కావాలనే ఆశతోపాటు రాజకీయ కారణాలతోనే ఆమె ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సుదీర్ఘ కాలం తర్వాత బయటకు.. 

ఈ కేసుకు సంబంధించి కారొల్‌ రాసిన పుస్తకంలోని వివరాలను 2019లో న్యూయార్క్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. వాటిని తోసిపుచ్చిన ట్రంప్‌.. అమెవన్నీ తప్పుడు ఆరోపణలంటూ సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆమె.. తన పరువుకు నష్టం కలిగించారంటూ న్యాయస్థానంలో దావా వేశారు. అయితే, అత్యాచారం నేరానికి సంబంధించిన ఆరోపణలు చేసే గడువు అప్పటికే ముగిసిపోయింది. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలంటే ఘటన జరిగిన మూడేళ్లలోపే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే, గతేడాది కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధన (Adult Survivors Act) ఆమెకు మరో అవకాశం కల్పించినట్లయ్యింది. కొన్ని దశాబ్దాల క్రితం లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు దావా వేసేందుకు ఏడాది గడువు ఇవ్వడంతో ట్రంప్‌పై కారొల్‌ మరో దావా వేశారు.

ఇదిలాఉంటే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటువంటి లైంగిక వేధింపుల ఆరోపణల అనేకం వచ్చాయి. వాటన్నింటినీ ట్రంప్‌ ఖండిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వాటిలో ఏ ఒక్క కేసులోనూ ట్రంప్‌ విచారణ ఎదుర్కోలేదు. ఇటీవల శృంగార తారతో అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో మాత్రం అరెస్టయ్యారు. తాజాగా లైంగిక ఆరోపణల కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు పూర్తికావడానికి ఐదు నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని