Health Risk: ఒంటికాలిపై 10సెకన్లు నిలబడే శక్తిలేదా? అయితే.. ముప్పు ఉన్నట్లే..!

మీరు ఒంటికాలు మీద కనీసం పది సెకన్లు నిలబడలేకుండా ఉన్నారా..? అయితే భవిష్యత్తులో మీకు ప్రాణాపాయం ఉన్నట్లే.

Published : 24 Jun 2022 01:34 IST

ముప్పును ముందుగానే పసిగట్టవచ్చంటున్న పరిశోధకులు

లండన్‌: మీరు ఒంటికాలి మీద కనీసం పది సెకన్లు నిలబడలేకుండా ఉన్నారా..? అయితే భవిష్యత్తులో మీకు ప్రాణాపాయం ఉన్నట్లే. అవును.. కనీసం పది సెకన్ల పాటు ఒక కాలుమీద నిలబడలేని మధ్య వయస్కులకు రాబోయే పదేళ్ల కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంతేకాకుండా అలాంటివారిలో మరణించే ముప్పు కూడా అధికంగానే ఉందని హెచ్చరించింది. తాజా అధ్యయనం బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది.అయితే, ఈ అధ్యయనంలో పాల్గొన్న వాలంటీర్లు మొత్తం బ్రెజిల్‌కి చెందినవారే. అందుకే తాజా అధ్యయన ఫలితాలు వివిధ జాతులు, వివిధ దేశాల వారికి కచ్చితంగా వర్తించకపోవచ్చని.. ఫలితాలు వేర్వేరుగా ఉండవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.

బ్యాలెన్సింగ్‌ పరీక్షతో..

శారీరక దృఢత్వం, ఆరోగ్యం (Health) అనే అంశాలపై బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా 2009-2020 మధ్యకాలంలో దాదాపు 1,702 (50-71ఏళ్ల వయసు) మంది ఆరోగ్యంపై అధ్యయనం చేపట్టారు. ఇందులో పాల్గొన్న వాలంటీర్లకు 10 సెకన్ల బ్యాలెన్సింగ్‌ పరీక్ష (Balance Test) నిర్వహించారు. ఒక కాలిపై నిలబడి.. మరోకాలును నేలకు తగలకుండా, రెండు చేతులకు ఎటువంటి సపోర్టు లేకుండా నిలబడాలని సూచించారు. ఇలా మూడుసార్లు ప్రయత్నించేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించారు. అయినప్పటికీ ప్రతి ఐదుగురిలో ఒకరు బ్యాలెన్సింగ్‌ పరీక్షలో విఫలమైనట్లు పరిశోధకులు గుర్తించారు. 

ఈ పరీక్షలో ఫెయిలైన వారిలో ఎక్కువగా తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారే ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఎటువంటి సపోర్టు లేకుండా ఒంటికాలిపై నిలబడే వారితో పోలిస్తే టెస్టులో ఇబ్బందిపడిన 84శాతం మంది వాలంటీర్లలో (తదుపరి 10ఏళ్లలో) మరణం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫెయిలైన వారిలో మరణాల నిష్పత్తి గణనీయంగా ఉందని (17.5శాతం), అదే పాసైన వారిలో మాత్రం కేవలం 4.5శాతంగా ఉందని చెప్పారు. ఈ మరణాలు ఎక్కువగా ఉండడానికి నిర్దిష్ట కారణాలను మాత్రం పరిశోధకులు తెలుసుకోలేకపోయారు. అయితే, టెస్టులో విఫలమైన వారిలో ఎక్కువ మంది మధుమేహం (టైప్‌-2), హృద్రోగ సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటుండగా.. మరణించిన వారిలో మాత్రం ఎక్కువగా క్యాన్సర్‌, హృద్రోగ, శ్వాసకోశ వ్యాధులు, కొవిడ్‌ దుష్ర్పభావాలతో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

వృద్ధులకు ఎంతో కీలకం

ఇలా వృద్ధులకు సాధారణ బ్యాలెన్సింగ్‌ పరీక్ష నిర్వహించడం వల్ల వారి కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వైద్యులకు తెలియజేయవచ్చని పరిశోధనలో పాల్గొన్న బ్రెజిల్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా పరిశోధకులు వెల్లడించారు. కిందపడిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 6,80,000 మంది చనిపోతున్నారని.. ఇలాంటి ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఈ పదిసెకన్ల పరీక్ష ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఎంతో సురక్షితమైన ఈ పరీక్షను రొటీన్‌ చెకప్‌లో చేర్చడం వల్ల అటు రోగులకు, వైద్య నిపుణులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తాజా నివేదిక ద్వారా సూచించారు. 60ఏళ్ల వయసు చేరుకునే వరకూ ఇలా బ్యాలెన్సింగ్‌ చేసుకునే సామర్థ్యం ఉంటుందని.. అనంతరం ఇది వేగంగా క్షీణిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని