United States: అమెరికాలో కాల్పులు..ఓ ఇంట్లో నలుగురి మృతి

అమెరికాలోని మెనే రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు మృతిచెందారు.

Updated : 19 Apr 2023 15:09 IST

వాషింగ్టన్‌: అమెరికా(United States)లోని మెనే (Maine) రాష్ట్రంలో మంగళవారం కాల్పుల ఘటన చోటు చేసుకొంది. బౌడోయిన్‌ ప్రాంతంలోని ఓ ఇంటిలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. అనంతరం 295వ నంబర్‌ హైవేపై కూడా పలు వాహనాలపై కాల్పులు చోటు చేసున్నాయి. పోర్ట్‌ల్యాండ్‌ - బౌడోయిన్‌ మధ్య ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. రెండు చోట్ల జరిగిన కాల్పులకు సంబంధం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. దీంతో హైవేలో కొంత భాగాన్ని గంటన్నర పాటు పోలీసులు మూసివేశారు. ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని నిషేధాజ్ఞలు జారీ చేశారు. సామాన్యలకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక ఆంక్షలు ఎత్తివేశారు.

బౌడోయిన్‌లోని ఓ ఇంటిలో నలుగురి మృతికి కారణమైనట్లు అనుమానిస్తున్న జోసెఫ్‌ ఈటన్‌(34) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఈ వారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జానెట్‌ మిల్స్‌ స్పందించారు. ‘‘ఈ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు మన రాష్ట్రాన్ని కదిలించాయి. వీటి గురించి తెలియగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని