సంక్షిప్త వార్తలు(4)

సముద్రపు నీటిని ముందుగా శుద్ధి చేయకుండా నేరుగా ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టే ప్రక్రియను అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. ఈ బృందానికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ వర్సిటీకి చెందిన యావో ఝెంగ్‌ సారథ్యం వ్యవహరించారు.

Updated : 04 Feb 2023 05:50 IST

సముద్రజలం నుంచి హరిత ఉదజని

మెల్‌బోర్న్‌: సముద్రపు నీటిని ముందుగా శుద్ధి చేయకుండా నేరుగా ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టే ప్రక్రియను అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. ఈ బృందానికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ వర్సిటీకి చెందిన యావో ఝెంగ్‌ సారథ్యం వ్యవహరించారు. క్రోమియం ఆక్సైడ్‌ పూతతో చవకగా లభించే కోబాల్ట్‌ ఆక్సైడ్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగించి సముద్రజలాన్ని విద్యుత్‌ ప్రయోగంతో (ఎలక్ట్రోలైసిస్‌) ఆమ్లజని, హరిత ఉదజని (గ్రీన్‌ హైడ్రోజన్‌)గా విడగొట్టారు. సాధారణంగా ఎలక్ట్రోలైసిస్‌ ప్రక్రియకు ముందు రివర్స్‌ ఆస్మోసిస్‌ డెసొలేషన్‌, క్షారీకరణ వంటి ప్రక్రియల్లో నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది.  శిలాజ ఇంధనాల బదులు హరిత ఉదజని ఉత్పత్తికి తాగునీటిని ఉపయోగించడం జలవనరుల కొరతను తీవ్రం చేస్తుంది. సముద్రజలం దాదాపు అనంతం కాబట్టి నీటి కొరత ఏర్పడదు.  


మూత్రపరీక్షతో మెదడులో కణితి నిర్ధారణ

టోక్యో: మూత్రాన్ని విశ్లేషించడం ద్వారా.. మెదడులో కణితి ఉందో లేదో సులువుగా నిర్ధారించగల సరికొత్త పరీక్షను జపాన్‌ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. సాధారణంగా మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తుల మూత్రంలో కణితి సంబంధిత ఎక్స్‌ట్రాసెల్యులర్‌ వెసికిల్స్‌ (ఈవీ) ఉంటాయి. అత్యంత సూక్ష్మపరిమాణంలోని ఈ ఈవీల జాడను పసిగట్టడం ద్వారా కణితి నిర్ధారణ జరపొచ్చని జపాన్‌లోని నాగోయ, టోక్యో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకోసం నానోవైర్లతో కూడిన  పరికరాన్ని తయారుచేశారు. బాధితుల మూత్ర నమూనాల్లో సీడీ31, సీడీ63 అనే ఈవీ త్వచ ప్రొటీన్లను గుర్తించడం ద్వారా తొలి దశల్లోనే కణితి నిర్ధారణకు అది దోహదపడుతుందని వారు తెలిపారు.


సైబర్‌ సెక్యూరిటీ బలోపేతానికి క్వాడ్‌ నిర్ణయం

వాషింగ్టన్‌: సైబర్‌ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెషిన్‌ లెర్నింగ్‌తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికాలతో కూడిన క్వాడ్‌ కూటమి నిర్ణయించింది. శ్వేతసౌధం గురువారం వెలువరించిన ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. సైబర్‌ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది. తమ తమ దేశాల్లోని ప్రజలకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికి క్వాడ్‌ కృషి చేస్తుందని వివరించింది.


బ్రిటన్‌లోకి భారతీయుల అక్రమ చొరబాటు

ఇంగ్లిష్‌ చానల్‌ ద్వారా వస్తున్నారు: హోంశాఖ

లండన్‌: ప్రమాదకరమైన చిన్న చిన్న పడవల ద్వారా సముద్ర మార్గం నుంచి భారతీయులు తమ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారని బ్రిటన్‌ హోంశాఖ వెల్లడించినట్లు యూకే మీడియా శుక్రవారం తెలిపింది. ‘‘సెర్బియాలో పర్యటించేందుకు భారతీయులకు వీసా అవసరం లేకపోవడంతో.. కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకొని ఇంగ్లిష్‌ చానల్‌ ద్వారా చిన్న చిన్న పడవల్లో బ్రిటన్‌లోకి వస్తున్నారు. శరణార్థులుగా వచ్చే వారు బ్రిటన్‌లో చదువుకోవడానికి ఉండే నిబంధనల వెసులుబాటును ఉపయోగించుకుంటున్నారు. ఇలా అక్రమంగా వచ్చే వారి జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉంది’’ అని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని