పోరాడండి.. నా మద్దతు మీకే

ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచానికే సవాలు విసురుతున్న నేత ఒకరు.. తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న నేత ఇంకొకరు.. ఈ ఇద్దరు కలిస్తే.. అదీ 5 గంటలపాటు చర్చిస్తే.. సంచలనమే కదా! బుధవారం ఆ ఘటనే చోటు చేసుకుంది.

Updated : 14 Sep 2023 07:00 IST

పుతిన్‌కు కిమ్‌ హామీ
5 గంటలపాటు భేటీ

సియోల్‌: ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచానికే సవాలు విసురుతున్న నేత ఒకరు.. తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న నేత ఇంకొకరు.. ఈ ఇద్దరు కలిస్తే.. అదీ 5 గంటలపాటు చర్చిస్తే.. సంచలనమే కదా! బుధవారం ఆ ఘటనే చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యుద్ధంలో తన సంపూర్ణ మద్దతును పుతిన్‌కు కిమ్‌ ప్రకటించారు. పోరాడాలని సూచించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రష్యాకు పూర్తి, బేషరతు మద్దతు ఇస్తున్నానని వెల్లడించారు. రష్యా తూర్పు ప్రాంతంలోని లాంచ్‌ ప్యాడ్‌ అయిన వోస్తోని కాస్మోడ్రోమ్‌వద్ద ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. అత్యంత భద్రత కలిగిన సొంత రైలు లైమౌసిన్‌లో కిమ్‌ రాగా పుతిన్‌ వచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత రైలులోనే వారి భేటీ జరిగింది. ఆ తర్వాత కాస్మోడ్రోమ్‌ అంతా కలియతిరిగారు. భేటీ దాదాపు 5 గంటలపాటు జరిగింది. కిమ్‌ ఇంకా రెండు నగరాల్లో పర్యటిస్తారని రష్యా అధికార టీవీ ఛానల్‌కు పుతిన్‌ తెలిపారు. ఉత్తర కొరియా తన దగ్గర ఉన్న వేల ఆయుధ సామగ్రిని అందిస్తే ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరింత గట్టిగా పోరాడే అవకాశముందని సమాచారం. ప్రతిగా రష్యా నుంచి సైనిక గూఢచర్య శాటిలైట్లలో సహకారాన్ని కోరుతోంది. ఇటీవల సొంతంగా శాటిలైట్లను ప్రయోగించి ఉత్తర కొరియా విఫలమైంది. ఆర్థిక సహకారంపైనా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత కిమ్‌కు పుతిన్‌ అధికారిక విందు ఇచ్చారు. మరోవైపు భేటీ తర్వాత ఉత్తర కొరియా సముద్రంవైపు రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. అవి సముద్ర జలాల్లోనే పడ్డాయని, ఎటువంటి నష్టం జరగలేదని జపాన్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని