బ్రిటన్‌ హోం మంత్రి సువెల్లాకు ఉద్వాసన

బ్రిటన్‌ హోం మంత్రి పదవి నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగిస్తున్నట్లు రిషి సునాక్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ పదవిని విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీకి కట్టబెట్టింది.

Published : 14 Nov 2023 05:19 IST

విదేశాంగ మంత్రిగా డేవిడ్‌ కామెరూన్‌
కేబినెట్‌లో కీలక మార్పులు చేసిన సునాక్‌

లండన్‌: బ్రిటన్‌ హోం మంత్రి పదవి నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగిస్తున్నట్లు రిషి సునాక్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ పదవిని విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీకి కట్టబెట్టింది. పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శిస్తూ భారత సంతతికి చెందిన సువెల్లా ఇటీవల ‘ది టైమ్స్‌’ పత్రికలో వ్యాసం రాశారు. ప్రధాని ఆమోదం పొందకుండా అలా రాయడం దేశంలో పెద్ద దుమారమే లేపింది. దీంతో బ్రేవర్మన్‌పై తక్షణమే వేటు వేయాలంటూ సునాక్‌పై ఒత్తిడి వచ్చింది. ఈ కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయిన ‘విదేశాంగ, కామన్వెల్త్‌, అభివృద్ధి వ్యవహారాల శాఖ’ మంత్రి పదవిలో మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బ్రెగ్జిట్‌ రిఫరెండంలో ఓటమి తర్వాత 2016 జూన్‌లో ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న సునాక్‌తో ఈ అంశంలో ఆయనకు విభేదాలు ఉండేవి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అయిదు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్లో ఉన్నారు. క్లెవర్లీతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. తాజా మార్పుల నేపథ్యంలో ఆయన కామెరూన్‌తో భేటీ అయ్యారు. పాఠశాల విద్య, ఆరోగ్య శాఖ, సామాజిక పరిరక్షణ, రవాణా శాఖల మంత్రులు కూడా తాము పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని