కరోనా పుట్టుక జంతువుల నుంచే

కరోనా వైరస్‌ జంతువుల నుంచే పుట్టింది తప్ప, ప్రయోగశాలలో సృష్టించింది కాకపోవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. ‘సైన్స్‌’ పత్రికలో ప్రచురితమైన ఈ కథనంలో.. వుహాన్‌లోని హునాన్‌ సీఫుడ్‌ హోల్‌సేల్‌

Published : 28 Jul 2022 04:13 IST

కొత్త పరిశోధనల్లో వెల్లడి

శాన్‌డిగో: కరోనా వైరస్‌ జంతువుల నుంచే పుట్టింది తప్ప, ప్రయోగశాలలో సృష్టించింది కాకపోవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. ‘సైన్స్‌’ పత్రికలో ప్రచురితమైన ఈ కథనంలో.. వుహాన్‌లోని హునాన్‌ సీఫుడ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఇది పుట్టిందని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ కేంద్రంలో ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్‌ క్రిస్టియన్‌ అండర్సన్‌ తెలిపారు. మరో పరిశోధనలో 2019 డిసెంబరులో ముందుగా నమోదైన 150 కొవిడ్‌ కేసులు ఎక్కడెక్కడ వచ్చాయో యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనాకు చెందిన ఎవల్యూషనరీ బయాలజిస్టు మైకేల్‌ వోరోబే, ఆయన సహచరులు గుర్తించారు. అలాగే, 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నమోదైన కేసుల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. ఈ కేసులన్నీ మార్కెట్‌కు అత్యంత దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. దాన్నిబట్టి మార్కెట్‌లో పని చేసే వారిలో ముందుగా ఈ వైరస్‌ మొదలై, తర్వాత స్థానికంగా వ్యాపించిందని తెలుసుకున్నట్లు వివరించారు. మరో పరిశోధనలో.. కొవిడ్‌ వైరస్‌లో రెండు లైనేజ్‌లు ఉన్నాయని, వాటిలో ఎ లైనేజి గబ్బిలాలకు సంబంధించినది కాగా, బి మాత్రం మార్కెట్లోని వ్యక్తుల నుంచి వచ్చినట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలోని వైరల్‌ ఎవల్యూషన్‌ నిపుణుడు జోయెల్‌ బృందం ఈ విషయాన్ని తెలిపింది. ఇలా అన్నింటి సారాంశాన్ని చూస్తే.. ముందుగా జంతువుల నుంచి మనుషులకు, తర్వాత మనుషుల నుంచి మనుషులకు ఇది వ్యాపించిందని తెలుస్తోంది. అయితే.. వైరస్‌ పూర్తిగా ల్యాబ్‌ లీక్‌ కాదని తాము చెప్పలేమని అండర్సన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని