సల్మాన్‌ రష్దీపై కత్తితో దాడి

భారత్‌లో జన్మించిన ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. పశ్చిమ న్యూయార్క్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. దుండగుడు కత్తితో ఆయన మెడపై

Published : 13 Aug 2022 05:09 IST

మెడపై పొడిచిన దుండగుడు
తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన రచయిత
అమెరికాలో సంచలన ఘటన

న్యూయార్క్‌: భారత్‌లో జన్మించిన ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. పశ్చిమ న్యూయార్క్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. దుండగుడు కత్తితో ఆయన మెడపై పొడిచాడు.దీంతో రష్దీ తీవ్ర రక్తస్రావంతో కూలబడ్డారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. 75 ఏళ్ల రష్దీ పశ్చిమ న్యూయార్క్‌లోని చౌతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. అక్కడ ప్రసంగించడం కోసం వేదికపైకి వెళ్లారు. ప్రసంగానికి ముందు- ఉదయం దాదాపు 11 గంటల సమయంలో ఆయన్ను ఆహూతులకు కార్యక్రమ నిర్వాహకులు పరిచయం చేస్తుండగా.. ఓ దుండగుడు వేదికపైకి వేగంగా దూసుకొచ్చాడు. కత్తితో రష్దీ మెడపై పొడిచాడు. గాయం నుంచి రక్తం కారుతుండగా, విలవిల్లాడుతూ ఆయన కుప్పకూలారు. అక్కడున్న పోలీసులు, ఇతరులు వెంటనే స్పందించి.. రష్దీకి వేదికపైనే కొంత ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హెలికాప్టర్‌లో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. అయితే రష్దీ ప్రాణాలతోనే ఉన్నారని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ కాథీ హోచుల్‌ స్పష్టం చేశారు. దుండగుడు వేదికపైకి వచ్చినప్పుడు అక్కడే ఉన్న మరో వ్యక్తి(ఇంటర్వ్యూయర్‌)పైనా దాడి చేశాడు. ఆ వ్యక్తి తలకు స్వల్ప గాయమైంది. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇరాన్‌ నుంచి తీవ్ర బెదిరింపులు

సల్మాన్‌ రష్దీని వివాదాస్పద రచయితగా చెబుతుంటారు. ఆయన 1947లో ముంబయిలో జన్మించారు. తర్వాత కొన్నేళ్లకు బ్రిటన్‌కు వలస వెళ్లారు. తాను రచించిన ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రెన్‌’ నవలకుగాను 1981లో బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. 1988లో వచ్చిన ఆయన నాలుగో నవల ‘ద సెటానిక్‌ వెర్సెస్‌’ చుట్టూ తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. అందులో దైవదూషణకు పాల్పడ్డారంటూ.. హత్యా బెదిరింపులు వచ్చాయి. ఫలితంగా తొమ్మిదేళ్లపాటు ఆయన ప్రాణభయంతో అజ్ఞాతంలో ఉన్నారు. ‘ది సెటానిక్‌ వెర్సెస్‌’ ప్రచురితమైన ఏడాది తర్వాత.. రష్దీని చంపేయాలంటూ ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా రుహొల్లా ఖొమేనీ పిలుపునిచ్చారు. ఆయన ప్రాణాలు తీస్తే 30 లక్షల డాలర్ల రివార్డు అందజేస్తామని కూడా ఇరాన్‌ ప్రకటించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని