చరిత్రాత్మక బిల్లుకు బైడెన్‌ ఆమోదం

అమెరికాలో వాతావరణ మార్పుల నియంత్రణ, ప్రజారోగ్యానికి ఉద్దేశించి డెమోక్రాట్లు రూపొందించిన చరిత్రాత్మక ‘క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌’ బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం ఆమోదముద్ర వేసి చట్టరూపం కల్పించారు. సౌర, పవన

Updated : 18 Aug 2022 06:03 IST

వాతావరణం, ప్రజారోగ్యంపై చట్టం
నవంబరు ‘ఎన్నికల’పై గురి!

వాషింగ్టన్‌: అమెరికాలో వాతావరణ మార్పుల నియంత్రణ, ప్రజారోగ్యానికి ఉద్దేశించి డెమోక్రాట్లు రూపొందించిన చరిత్రాత్మక ‘క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌’ బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం ఆమోదముద్ర వేసి చట్టరూపం కల్పించారు. సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు పన్ను రాయితీలను ఇవ్వడంతోపాటు రానున్న దశాబ్దంలో వాతావరణ మార్పుల నిరోధానికి 37,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. అలాగే మెడికేర్‌ గ్రహీతలు జేబు నుంచి మందుల కోసం చేయాల్సిన ఖర్చు ఏడాదికి 2,000 డాలర్లకు మించకుండా చూస్తుంది. ఈ రాయితీ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే వచ్చే ఏడాది నుంచి మధుమేహులు ఇన్సులిన్‌ కోసం నెలకు 35 డాలర్లకు మించి చెల్లించనక్కర్లేదు. కొవిడ్‌ సమయంలో ఆరోగ్య బీమా ప్రీమియంల చెల్లింపునకు 1.3 కోట్ల మందికి ఇచ్చిన సబ్సిడీలను మరో మూడేళ్లపాటు కొనసాగిస్తుంది. దీని కోసం 6,400 కోట్ల డాలర్లు కేటాయించింది. సౌర ఫలకాల తయారీ అభివృద్ధికి; కుటుంబాలు ఇంట్లో విద్యుత్‌ ఆదా చేసుకోవడానికి; బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపునకు; పొలాలు, రేవులు, అల్పాదాయ వర్గాల వాడల్లో వాయు నాణ్యత పెంపునకు పన్ను రాయితీలు, రుణాలు, పెట్టుబడులు సమకూర్చాలని బిల్లు నిర్దేశించింది. వాతావరణ పరిరక్షణ, వైద్య సహాయానికి అయ్యే ఖర్చును తట్టుకోవడానికి బడా కంపెనీల మీద పన్నులు పెంచాలని, సంపన్నుల నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేయాలని సూత్రీకరించింది. అయితే అధిక పన్నులను ప్రతిపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ధరలు పెరుగుతాయని, 1981 తరవాత ఎన్నడూ లేనంత అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అమెరికాలో పరిస్థితి మరింత దిగజారుతుందని వాదిస్తున్నారు. అయితే ఏడాదికి 4 లక్షల డాలర్లకు మించి సంపాదిస్తున్న కంపెనీలు, వ్యక్తులపైనే పన్నుల భారం పెరుగుతుందని పాలక డెమోక్రాట్లు వివరిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో దిగువ సభ అయిన ప్రజాప్రతినిధుల సభ గత శుక్రవారం కొత్త బిల్లును 220-207 ఓట్ల తేడాతో ఆమోదించింది. పాలక, ప్రతిపక్షాలు రెండింటికీ సరి సమానంగా చెరి 50 సీట్లు ఉన్న ఎగువసభ సెనెట్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఓటుతో బిల్లు నెగ్గింది. ఆమె డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారే. అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రజాదరణ తగ్గుతున్నట్లు పలు సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో గత మూడు నెలలుగా డెమోక్రాటిక్‌ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మాజీ సైనికోద్యోగులకు అదనపు ప్రయోజనాలు కల్పించే చట్టాన్ని తెచ్చింది. సెమీ కండక్టర్‌ పరిశ్రమకు ఊపునిచ్చింది. యువత తుపాకులు కొనడంపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాను నిరోధించడానికి బైడెన్‌ సర్కారు అనేక విధాలుగా సహాయపడుతోంది. తాజా చట్టంతో బైడెన్‌కు ప్రజాదరణ పెరుగుతుందని అధికార పార్టీ ఆశిస్తోంది. ఈమేరకు నవంబరులో జరగనున్న కాంగ్రెస్‌ మధ్యంతర (మిడ్‌టెర్మ్‌) ఎన్నికలకు సమాయత్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని