Germany: చైనాపై ఆధార పడటాన్ని తగ్గించుకోవాలి: జర్మనీ సరికొత్త ప్లాన్ సిద్ధం

చైనాకు షాకిచ్చేందుకు ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ సిద్ధమైంది. కీలక రంగాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది.  

Updated : 14 Jul 2023 13:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China) పారిశ్రామిక రంగానికి మరో గట్టి షాక్‌ తగలనుంది. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు ఐరోపాలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన జర్మనీ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు ‘స్ట్రాటజీ ఆన్‌ చైనా’ పేరిట 40 పేజీల వ్యూహపత్రాన్ని గురువారం విడుదల చేసింది. దీనిలో బీజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు బెర్లిన్‌ అనుసరించాల్సిన కఠిన నిబంధనలను వెల్లడించంది. ఇది నిజంగా చైనాకు షాకిచ్చే విషయం.

‘‘చైనా మారిపోయింది. ఆ దేశ రాజకీయ నిర్ణయాలు, మార్పుల కారణంగా మేము కూడా చైనా విషయంలో అనుసరించే వైఖరిని మార్చుకోవాల్సి ఉంది’’ అని ఆ వ్యూహపత్రంలో పేర్కొంది. ‘‘తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి అది (చైనా) తీవ్రంగా పనిచేస్తోంది. ఇందు కోసం అంతర్జాతీయ నిబంధనలు కూడా మార్చేందుకు ప్రయత్నించడం ప్రపంచ భద్రతకు ఇబ్బందికరంగా మారింది’’ అని ఆ పత్రంలో పేర్కొన్నారు. జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొన్ని రోజులపాటు మల్లగుల్లాలు పడి చివరికి దీనికి ఆమోద ముద్రవేసింది. చైనాలో వ్యాపారం, పెట్టబడులను కొనసాగిస్తూనే.. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది.

ముఖ్యంగా ఔషధాలు, విద్యుత్తు కార్లలో వాడే లిథియం బ్యాటరీలు, చిప్స్‌ తయారీ ముడిసరుకుల విషయంలో దీనిని అమలు చేయనుంది. ఈ వ్యూహ పత్రంపై దేశ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ట్వీట్‌చేశారు. ‘‘మేము చైనా నుంచి విడిపోవాలనుకోవడంలేదు. కానీ, కీలక విషయాల్లో ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకొంటున్నాం’’ అని పేర్కొన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలు పెరిగాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది. బెర్లిన్‌కు బీజింగ్‌ అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామి. 2022లో ఇరుదేశాల మధ్య 300 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని