Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఫ్రాన్స్‌ అత్యున్నత అవార్డుతో సత్కారం

Modi France Visit: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీని అధ్యక్షుడు మేక్రాన్‌.. ఆ దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.

Updated : 14 Jul 2023 10:09 IST

పారిస్‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi France Visit)కి అరుదైన గౌరవం లభించింది. ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron).. మోదీని ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ పురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.

గురువారం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మేక్రాన్‌.. మోదీకి ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా, బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌, జర్మనీ మాజీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బుట్రోస్‌ బుట్రోస్‌ ఘలి వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన మోదీ చేరారు. ఈ సత్కారానికి గానూ భారత ప్రజల తరఫున మోదీ.. మేక్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అధ్యక్ష భవనం ఎలీసీ ప్యాలెస్‌లో అధ్యక్షుడు మేక్రాన్‌ దంపతులు ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఇచ్చారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ (PM Modi) గురువారం పారిస్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (UPI)ని ఫ్రాన్స్‌లోనూ వినియోగించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. భారతీయ విద్యార్థులు మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు ఐదేళ్ల వీసాలు మంజూరు చేయడానికి ఫ్రాన్స్‌ నిర్ణయించిందని వెల్లడించారు. మార్సెల్లీలో నూతనంగా భారత కాన్సులేట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం- బాస్టీల్‌ డే వేడుకల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు.

ఎంబాపె మీకంటే మాకే బాగా తెలుసు..

నిన్న రాత్రి ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌కు చెందిన సంచలన ఫుట్‌బాల్‌ ఆటగాడు కిలియన్‌ ఎంబాపె (Kylian Mbappe)పై మోదీ ప్రశంసలు కురిపించారు. భారత్‌లో అతడికి పాపులారిటీ పెరుగుతోందన్నారు. ‘‘భారత యువతలో ఎంబాపె సూపర్‌ హిట్‌ అయ్యాడు. అతడి గురించి ఫ్రాన్స్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ మందికి తెలుసనుకుంటా’’ అని మోదీ అన్నారు.

గతేడాది చివర్లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ (FIFA Worldcup 2022) తుదిపోరులో హ్యాట్రిక్‌ గోల్స్‌తో ఎంబాపె అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్‌ పోరులో ఫ్రాన్స్‌ ఓటమిపాలైనప్పటికీ.. విజయం కోసం గొప్పగా పోరాడిన ఎంబాపె అందరి హృదయాలను గెలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని