Israel Hamas: 12 గంటలపాటు కాల్పులు.. హమాస్‌ ‘వెస్ట్‌బ్యాంక్‌’ కమాండర్‌ హతం!

ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్‌ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ ఆలా శ్రేతేహ్‌ హతమయ్యాడు.

Published : 05 May 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel Hamas)ల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి కనిపించినట్లు వార్తలు వచ్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టెల్‌అవీవ్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్‌ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ హతమయ్యాడు. మొత్తం నలుగురు మృతి చెందగా.. వారిలో తమ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్‌ (45) ఉన్నట్లు హమాస్‌ ధ్రువీకరించింది. అతడు 2002- 2016 మధ్యకాలంలో ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవించాడు. వెస్ట్ బ్యాంక్‌లోని తుల్కరేమ్ ప్రాంతంలో తమ దళాలు, ఉగ్రవాదుల మధ్య 12 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ క్రమంలోనే నలుగురు మరణించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

‘అల్ జజీరా’పై వేటు!

ఇజ్రాయెల్‌కు, ఖతర్‌ యాజమాన్యంలో నడుస్తున్న ‘అల్‌ జజీరా’ ప్రసార సంస్థకు మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తమ పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, హమాస్‌కు సహకరిస్తోందని టెల్‌అవీవ్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. తమ దేశంలో ‘అల్‌ జజీరా’ కార్యకలాపాలను మూసేయాలన్న నిర్ణయానికి అనుకూలంగా తన క్యాబినెట్‌ ఓటు వేసినట్లు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. అయితే.. ఇది ఎప్పుటినుంచి అమల్లోకి వస్తుంది? శాశ్వతమా? లేదా తాత్కాలికమా? అనే వివరాలు తెలియరాలేదు. గతేడాది ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో దోహా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని