Imran Khan: ఇమ్రాన్‌ దోషిగా తేలితే.. పార్టీకి నిషేధం ముప్పు!

పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీని నిషేధం విధించే అవకాశం వచ్చినప్పటికీ.. తగిన సమయంలో సుప్రీం కోర్టుకు (Supreme Court) వెళ్లాలని మునుపటి ప్రభుత్వం భావించిందట.

Published : 28 Jan 2024 19:41 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో గతేడాది చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) దోషిగా తేలితే పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీకి నిషేధం ముప్పు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించి మునుపటి ప్రభుత్వానికి అవకాశం వచ్చినప్పటికీ.. తగిన సమయంలో సుప్రీం కోర్టుకు (Supreme Court) వెళ్లాలని భావించిందట. హింసాత్మక ఘటనలు, అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌, ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పార్లమెంటు సభ్యత్వం ఇదివరకే రద్దయ్యింది. ఆయన నేతృత్వంలోని పీటీఐ పార్టీపై నిషేధం విధించే అవకాశం పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి (పీడీఐ) వచ్చిందట. ఇందుకు పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (Election Commission) నివేదికను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని పీడీఐ భావించినట్లు సమాచారం. అయితే, తగిన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మునుపటి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అజాం నాజిర్‌ తరార్‌ తాజాగా పాక్‌ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ పార్టీ.. ఎలక్షన్‌ యాక్ట్‌-2017లో అనేక నిబంధనలను ఉల్లంఘించినట్లు తరార్‌ పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నిషేధంపై చట్టపరంగా పోరాడాలని భావించామన్నారు. ఆర్థిక సమస్యల నుంచి ప్రభుత్వం గట్టెక్కడంపైనే దృష్టి పెట్టామని.. అందుకే ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతమున్న ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు. ఏదేమైనా కొన్ని వారాల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు దోషులుగా తేలిన తర్వాతే పార్టీ నిషేధం సాధ్యమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పాక్‌ మీడియా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని