Missing Ship: నౌక మునక.. 120 ఏళ్లకు వీడిన మిస్టరీ!

ఆస్ట్రేలియా తీరంలో దాదాపు 120 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.

Published : 27 Feb 2024 17:24 IST

కాన్‌బెర్రా: దాదాపు 120 ఏళ్ల క్రితం సముద్రంలో అదృశ్యమైన ఓ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆస్ట్రేలియా (Australia) తీరంలో సముద్రగర్భంలో దాన్ని గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం.. ‘ఎస్‌ఎస్‌ నెమెసిస్‌ (SS Nemesis)’ అనే నౌక 1904లో బొగ్గు లోడుతో న్యూక్యాసెల్‌ నుంచి మెల్‌బోర్న్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో న్యూసౌత్‌వేల్స్‌ (NSW) తీరంలో భారీ తుపాను ధాటికి నీట మునిగింది. అందులోని 32 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఇది జరిగిన కొన్ని వారాలకు కొంతమంది మృతదేహాలు, నౌకకు సంబంధించిన శకలాలు సిడ్నీకి 29 కి.మీ. దూరంలోని క్రోనులా బీచ్‌కు కొట్టుకువచ్చాయి. ఓడ ఆచూకీ మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

భారత్‌-బ్రిటన్‌ సముద్రగర్భ కమ్యూనికేషన్‌ కేబుల్‌పై హూతీల దాడి..!

ఓ రిమోట్ సెన్సింగ్ కంపెనీ 2022లో సిడ్నీ తీరంలో సముద్ర భూభాగాన్ని శోధిస్తుండగా.. అనుకోకుండా ఓ నౌక శిథిలాలు లభ్యమయ్యాయి. న్యూసౌత్‌వేల్స్‌లోని వొలొంగాంగ్‌ తీరం నుంచి 28 కి.మీ. దూరంలో, దాదాపు 160 మీటర్ల లోతున వాటిని గుర్తించింది. రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా శాస్త్రీయ పరిశోధన సంస్థ (CSIRO) నిపుణులు విశ్లేషణలు జరిపి.. తాజాగా దాన్ని ‘ఎస్‌ఎస్‌ నెమెసిస్‌’గా తేల్చారు. 73 మీటర్ల పొడవైన ఈ ఓడలో కొన్ని నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. లైఫ్ బోట్‌లను మోహరించే సమయం లేనంత వేగంగా మునిగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులు ముందుకురావాలని అధికారులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని