India-Canada: కెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ.. జీ20 భేటీ వేళ భారత్‌ కీలక నిర్ణయం!

India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల (E-Visa Services)ను భారత్‌ పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో కెనడియక్లకు అన్ని రకాల వీసా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లైంది.

Updated : 22 Nov 2023 14:53 IST

దిల్లీ: ఖలిస్థానీ అంశంపై భారత్‌, కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 2 నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవల (E-Visa Services)ను భారత్‌ బుధవారం పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. జీ20 దేశాధినేతల వర్చువల్‌ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో.. ఈ ఏడాది సెప్టెంబరు 21 నుంచి కెనడియన్లకు వీసా (Visa) సర్వీసులను భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించిన అనంతరం అక్టోబర 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసా కేటగిరీల్లో సేవలను పునరుద్ధరించారు. తాజాగా ఈ-వీసా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కెనడా పౌరులకు అన్ని రకాల వీసా సర్వీసులను భారత్‌ పునరుద్ధరించినట్లైంది.

హమాస్‌తో డీల్‌కు ఇజ్రాయెల్‌ ఓకే.. 50 మంది బందీలకు లభించనున్న విముక్తి

మోదీ వర్చువల్ సదస్సుకు.. ట్రూడో

భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జీ20 (G20 Virtual Meet) దేశాధినేతల వర్చువల్‌ సదస్సు జరగనుంది. ఈ భేటీలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా పాల్గొననున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల జరిగిన జీ20 దేశాల స్పీకర్ల సదస్సుకు కెనడా దూరంగా ఉంది. దీంతో తాజా సమావేశానికి ట్రూడో హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొనగా.. దానిపై ఒట్టావా స్పష్టతనిచ్చింది. అయితే, ఈ భేటీ జరగనున్న సమయంలో వీసాల పునరుద్ధరణ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని.. అక్కడి మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్‌.. మన దేశంలో కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేగాక, కెనడాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు, కెనడా వెళ్లాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఓ అడ్వైజరీ కూడా జారీ చేసింది. అదే సమయంలో దౌత్య సిబ్బంది విషయంలో ఇరు దేశాల మధ్య సమస్థాయి ఉండాలని పేర్కొంటూ.. భారత్‌లో తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని ట్రూడో సర్కారుకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని