Morality Police: దిగొచ్చిన ఇరాన్‌.. నైతిక పోలీసు విభాగం రద్దు!

రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న హిజాబ్‌ ఆందోళనల క్రమంలో.. ఇరాన్‌(Iran) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమినీ మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని(Morality Police) రద్దు చేసింది.

Updated : 04 Dec 2022 16:28 IST

టెహ్రాన్‌: రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న హిజాబ్‌ ఆందోళనల క్రమంలో.. ఇరాన్‌(Iran) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.  అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని(Morality Police) రద్దు చేసింది. ‘నైతిక పోలీసు విభాగానికి.. న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. దాన్ని రద్దు చేశాం’ అని దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంతజేరి ప్రకటించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హిజాబ్‌ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థలు కలిసి సమాలోచనలు జరుపుతున్నాయంటూ అటార్నీ జనరల్ వెల్లడించిన మరుసటి రోజే ఈ ప్రకటన వచ్చింది.

నిరసనలకు తక్షణ కారణం ఇదే..

ఈ ఏడాది సెప్టెంబరులో అమీని అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి.. ఆమె మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అమీని మృతిపై సెప్టెంబర్‌ 17న నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా ఉద్ధృతంగా మారి.. రాజధాని టెహ్రాన్‌తోసహా దేశవ్యాప్తంగా అనేక చోట్లకు వ్యాపించాయి. రెండు నెలలకుపైగా ఇప్పటికీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. స్థానిక భద్రతా బలగాలు ఈ నిరసనలను కర్కశంగా అణచివేస్తోన్నాయన్న విమర్శలొస్తున్నాయి.

ఏంటీ నైతిక పోలీసు విభాగం?

ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలి. తమ జుట్టును పూర్తిగా కప్పి ఉంచేలా హిజాబ్‌ ధరించాలి. హిజాబ్‌ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలను అరెస్టు చేసేందుకు కూడా వీలు కల్పించారు. ఆ చట్టం అమలును పర్యవేక్షించేందుకు 2005లో నైతిక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇరాన్‌లో ఒక ప్రత్యేక పోలీసు విభాగం. స్థానికంగా ‘గస్త్-ఎ-ఇర్షాద్’గా పిలుస్తారు. పౌరులు ఇస్లామిక్ నైతిక విలువలను గౌరవించేలా చూడటం, సక్రమంగా దుస్తులు ధరించనివారిపై చర్యలు తీసుకోవడం వంటివి ఇందులోని సిబ్బంది విధుల్లో భాగం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని