Israel: ఫిన్‌లాండ్‌కు డేవిడ్స్‌ స్లింగ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌: ఇజ్రాయెల్‌ ప్రకటన

ఓ వైపు హమాస్‌తో యుద్ధం కొనసాగుతుండగానే.. ఇజ్రాయెల్‌ తమ రక్షణ వ్యవస్థలను ఇతర దేశాలకు విక్రయిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా ఈ దేశం నుంచి డేవిడ్స్‌ స్లింగ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ఫిన్‌లాండ్‌ కొనుగోలు చేస్తోంది. 

Published : 13 Nov 2023 02:11 IST


(Photo: X/Israel's Ministry of Defense)

టెల్‌ అవీవ్‌: ఒక వైపు హమాస్‌ (Hamas)తో యుద్ధం కొనసాగుతున్నా మరోవైపు రక్షణరంగంలో ఇజ్రాయెల్‌ (Israel) మరో ఆయుధాల విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాటో నూతన సభ్య దేశం ఫిన్‌లాండ్‌కు తమ డేవిడ్స్‌ స్లింగ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (David's Sling air defence system)ను విక్రయించనున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ప్రకటించింది. 340 మిలియన్‌ డాలర్లకు ఈ ఒప్పందం కుదిరిందని, ఇది చారిత్రక ఒప్పందమని పేర్కొంది.  

ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలో డేవిడ్స్‌ స్లింగ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి.. గగనతలంలోకి శత్రువులు ప్రయోగించిన బాలిస్టిక్‌.. క్రూయిజ్‌ క్షిపణులను, ఎయిర్‌క్రాఫ్ట్స్‌, డ్రోన్లను గుర్తించి కూల్చివేసే సామర్థ్యం ఉంది. ఈ వ్యవస్థను అమెరికాకు చెందిన కంపెనీలతో కలిసి ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసింది. డేవిడ్స్‌ స్లింగ్‌ సిస్టమ్‌ విక్రయానికి అమెరికా ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఫిన్‌లాండ్‌ తమ దేశ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో భాగంగానే ఈ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.   

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్‌ ఓటు..!

గత సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌ నుంచి యారో-3 హైపర్‌సోనిక్‌ మిసైల్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేసేందుకు జర్మనీ 3.5 బిలియర్‌ డాలర్ల ఒప్పందం చేసుకుంది. యారో-3 సిస్టమ్‌ను కూడా అమెరికాతో కలిసి ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసి.. ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఈ కొనుగోలుకు అమెరికా అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఒక చిన్న దేశానికి సంబంధించి రక్షణ రంగంలో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ఆయుధాలకు యూరప్‌ దేశాల నుంచి డిమాండ్‌ పెరిగే అవకాశముందంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని