Israel-Hamas: ‘కాఫీ, కుకీలు ఇచ్చి.. హమాస్‌ మిలిటెంట్లను ఏమార్చి..!’

Israel-Hamas: కళ్లముందు మృత్యువు కన్పిస్తుంటే.. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ ఇజ్రాయెల్‌ మహిళ చూపిన సమయస్ఫూర్తిని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) కొనియాడారు. హమాస్‌ మిలిటెంట్లను ఏమార్చి.. దేశాన్ని కాపాడిన ఆమెను అభినందించారు. ఇంతకీ ఎవరామే? ఏం చేశారంటే..?

Published : 19 Oct 2023 12:16 IST

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌ (Israel)కు చెందిన 65ఏళ్ల రచేల్‌ ఇద్రి, ఆమె భర్త డేవిడ్‌.. ఇటీవల జరిగిన హమాస్‌ (Hamas) దాడిలో ప్రాణాలతో బయటపడ్డారు. తన ఇంట్లోనే 20 గంటల పాటు మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న వారు.. ఉగ్రవాదులకు కాఫీలు, కుకీలు ఇచ్చి.. పోలీసులు వచ్చేదాకా వారిని ఏమార్చారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)ను ఆమె కలిసి.. నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. మిలిటెంట్లను తానెలా తప్పుదోవ పట్టించింది రచేల్‌ ఆయనకు వివరించినట్లు ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ కథనంలో వెల్లడించింది. (Israel Hamas Conflict)

‘‘ఆ రోజు (అక్టోబరు 7) హమాస్‌ మిలిటెంట్లు మా ఇంట్లోకి చొరబడ్డారు. వారి చేతిలో గ్రనేడ్లు ఉన్నాయి. మా ఇద్దరినీ బందీలుగా చేసుకున్నారు. మా పిల్లలు పోలీసు అధికారులు. వారు వచ్చి మమ్మల్ని కాపాడుతారని తెలుసు. కానీ, వారు పోలీసులని ఉగ్రవాదులకు తెలియకూడదు. అందుకే వారిని ఏమార్చే ప్రయత్నం చేశాను. వారు ఆకలిగా ఉంటారని గ్రహించి డ్రింక్స్‌ ఆఫర్‌ చేశా. ఆ తర్వాత వారికి కాఫీ, కుకీస్‌ ఇచ్చా. ఇన్సులిన్‌ వేసుకోవాలని చెప్పి నా పిల్లల గురించి ఆరా తీయకుండా వారి దృష్టి మళ్లించా. నా పరిస్థితి జీవన్మరణ పోరాటమని తెలుసు. కానీ, ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాలనుకున్నా. ఒక దశలో ‘నాకు అరబిక్‌ నేర్పించండి.. మీకు హిబ్రూ నేర్పిస్తాను’ అంటూ వారితో మాటకలిపా’’ అని రచేల్‌ నాటి ఘటనను బైడెన్‌కు వివరించినట్లు సదరు మీడియ కథనం వెల్లడించింది.

ఇజ్రాయెల్ బలైంది వాస్తవమే.. కానీ..: బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

దాదాపు 20 గంటల పాటు రచేల్‌ దంపతులు మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నారు. తన కుటుంబం ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు తెలుసుకున్న రచేల్ కుమారుడు వెంటనే ఇంటికి వెళ్లాడు. అయితే, అప్పటికే పోలీసుల రాకను పసిగట్టిన మిలిటెంట్లు.. వారిని చంపేస్తామని బెదిరించారు. రచేల్ కుమారుడు తలుపు బద్దలు కొట్టి చూసే సరికి.. ఒక మిలిటెంట్‌ ఆమె మెడను పట్టుకొని కన్పించాడు. అప్పుడు కూడా రచేల్‌ బెదరలేదట..! తమ ఇంట్లో ఐదుగురు మిలిటెంట్లు ఉన్నారంటూ తన కుమారుడికి చేతి వేళ్లతో సిగ్నల్‌ ఇచ్చినట్లు సదరు కథనం పేర్కొంది. చివరకు స్వాట్‌ బృందం అక్కడకు చేరుకుని మిలిటెంట్లను మట్టుబెట్టి రచేల్‌ కుటుంబాన్ని కాపాడినట్లు తెలిపింది.

మిలిటెంట్ల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడమే గాక.. వారిని మట్టుబెట్టేలా పోలీసులకు సాయం చేయడంతో రచేల్‌పై అభినందనలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయంలో ఆయన్ను కొందరు ఇజ్రాయెల్‌ పౌరులు కలిశారు. అందులో రచేల్ కూడా ఒకరు. ఆమె గురించి తెలుసుకున్న బైడెన్‌.. రచేల్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సమయస్ఫూర్తితో  మాతృ దేశాన్ని కాపాడేందుకు యత్నించిన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని