SpaceX: అమెరికాకు నిఘా నెట్‌వర్క్‌ నిర్మిస్తున్న స్పేస్‌ఎక్స్‌..?

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ప్రపంచం కనీవినీ ఎరుగని స్థాయిలో అమెరికాకు నిఘా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది.  

Updated : 17 Mar 2024 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వందల కొద్దీ ఉపగ్రహాలతో అమెరికా నిఘా నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. వాటిని కక్ష్యలోకి చేర్చే పని స్పేస్‌ఎక్స్‌ (SpaceX) చేస్తోందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షీల్డ్‌ విభాగం ఈ మేరకు 2021లో ఎన్‌ఆర్‌వో విభాగంతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ 1.8 బిలియన్‌ డాలర్లు. ఎన్‌ఆర్‌వో సంస్థే అమెరికా నిఘా ఉపగ్రహాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్టులోని శాటిలైట్లు పదాతి దళానికి సహకరించనున్నాయి.

ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా ఇంటెలిజెన్స్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలనైనా తన లక్ష్యాలను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. మరోవైపు ఈ కాంట్రాక్ట్‌పై స్పేస్‌ఎక్స్‌ స్పందించలేదు. ఇక ఎన్‌ఆర్‌వో మాత్రం తాము ప్రభుత్వ ఏజెన్సీలు, కంపెనీలు, పరిశోధనా సంస్థలతో కలిసి ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ నిర్మించలేని స్థాయిలో శాటిలైట్‌ వ్యవస్థ ఏర్పాటుపై పనిచేస్తున్నట్లు పేర్కొంది. దీనిలో స్పేస్‌ఎక్స్‌ పాత్ర ఏంటనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌

2020లో దాదాపు డజనకుపైగా ప్రొటోటైప్‌ ఉపగ్రహాలను స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో కక్ష్యలోకి చేర్చారు. అప్పట్లో ఇందుకోసం 200 మిలియన్‌ డాలర్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత 1.8 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టు లభించింది. స్పేస్‌ఎక్స్‌ కొద్ది కాలంగా చాలా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించినా.. ప్రభుత్వం లేదా ఆ సంస్థగానీ బహిరంగంగా ప్రస్తావించలేదు.

ఉక్రెయిన్‌ యుద్ధంలో తన స్టార్‌ లింక్‌ సేవలను వాడే విషయంలో మస్క్‌, బైడెన్‌ మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. అయినా, ఆయన కంపెనీకి ఇంటెలిజెన్స్‌ కాంట్రాక్టు లభించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని