Trump: నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌

Trump: అమెరికా ఎన్నికల్లో ఈసారి తాను గెలవకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందని ట్రంప్‌ అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో బైడెన్ ఆర్థిక విధానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ప్రచార బృందం వివరణ ఇచ్చింది.

Updated : 17 Mar 2024 14:57 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్‌తో పోటీకి సిద్ధమైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికలు యూఎస్‌ చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని పేర్కొన్నారు. బైడెన్‌ (Biden) విధానాలను విమర్శిస్తూ ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా కార్లను అనుమతించబోం..

మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని ట్రంప్‌ (Trump) తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్‌ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని అన్నారు.

రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతినే!

ఆయన ఉద్దేశం వేరు: ట్రంప్‌ బృందం వివరణ

ట్రంప్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్‌ లీవిట్‌ వివరణ ఇచ్చారు. బైడెన్ (Joe Biden) విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్‌ సానుభూతి ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్‌ హిల్‌పై దాడి ఘటనలో అరెస్టయిన వారిని ఆయన ‘బందీలు’గా, ‘దేశభక్తులు’గా అభివర్ణించడం గమనార్హం.

మరోసారి హింసను ప్రేరేపిస్తున్నారు: బైడెన్‌ బృందం

ట్రంప్‌ వ్యాఖ్యలను బైడెన్‌ ప్రచార బృందం తప్పుబట్టింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఆయన మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. ఆయన ప్రతీకారాన్ని, అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారని వ్యాఖ్యానించింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతును డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ నుంచి ట్రంప్‌ సాధించిన విషయం తెలిసిందే. నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో వీరు తలపడనున్నారు.

భూటాన్‌ అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

ట్రంప్‌నకు నా మద్దతు లేదు: మైక్‌ పెన్స్‌

ట్రంప్‌ అభ్యర్థిత్వానికి తాను మద్దతివ్వడం లేదని ఆయన సొంత పార్టీ కీలక నేత మైక్‌ పెన్స్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌ అనేక విషయాల్లో పార్టీ విధానాలకు కట్టుబడలేదని వ్యాఖ్యానించారు. తనకు, ట్రంప్‌నకు మధ్య చాలా వ్యత్యాసముందన్నారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యాంగానికి లోబడే పనిచేశానన్నారు. ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గి దారి తప్పలేదని.. అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు.

ట్రంప్‌ హయాంలో పెన్స్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈసారి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డవారిలో ఆయన కూడా ఉన్నారు. కానీ, ప్రైమరీ ఎన్నికలు ప్రారంభం కావడానికే ముందే రేసు నుంచి వైదొలిగారు. గత ఎన్నికల సమయంలో ఫలితాల అనంతరం ట్రంప్‌ అనుసరించిన వైఖరి, ఆయన మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌పై దాడికి దిగడాన్ని పెన్స్‌ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని