Srilanka Crisis:మా నాన్న, నేను ఎక్కడికీ పారిపోం.. నమల్‌ రాజపక్స

శ్రీలంకలో సోమవారం చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స విదేశీ.....

Published : 13 May 2022 02:21 IST

కొలంబో: శ్రీలంకలో సోమవారం చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స విదేశీ ప్రయాణంపై కోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన తనయుడు, ఎంపీ నమల్‌ రాజపక్స స్పందించారు. సోమవారం జరిగిన దురదృష్టకర ఘటనలకు సంబంధించి ఎలాంటి దర్యాప్తుకైనా పూర్తిగా తాము సహకరిస్తామన్నారు. శ్రీలంకను విడిచి పారిపోవాలనే ఉద్దేశం తనకు గానీ, తన తండ్రికీ గానీ లేదని, శ్రీలంకలోనే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్‌ చేశారు. శ్రీలంకలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసిన వారే వాటికి జవాబుదారీ చేయాలన్నారు. వికృత గుంపుల చేష్టలకు బాధితులుగా మారిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్‌ విక్రమసింఘేకు అభినందనలు తెలుపుతూ మరో ట్వీట్‌ చేశారు. శ్రీలంకను ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తీసుకోవడం ఉత్తమంగా పేర్కొన్నారు.

శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు, మహీంద రాజపక్స మద్దతుదారుల మధ్య సోమవారం చెలరేగిన ఘర్షణలతో ద్వీప దేశం ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఘర్షణలు మరింత హింసాత్మకంగా మారడంతో గత సోమవారం మహీంద తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో మహీందను అరెస్టు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా మహీంద, ఆయన మద్దతుదారులపై శ్రీలంక ఫోర్ట్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించింది. అటార్నీ జనరల్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మహీంద రాజపక్స, ఎంపీ నమల్‌ రాజపక్స సహా పలువురిపై విదేశీ ప్రయాణ నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని