NATO: ఉక్రెయిన్‌కు భారీగా ‘యుద్ధ సామగ్రి’ అందించాం..!

రష్యా చేస్తోన్న దురాక్రమణను (Russian invasion) అడ్డుకుంటున్న ఉక్రెయిన్‌కు (Ukraine) హామీ ఇచ్చిన విధంగా భారీ స్థాయిలో సైనిక, ఆయుధ సహాయం చేసినట్లు నాటో కూటమి (NATO) వెల్లడించింది.

Published : 28 Apr 2023 00:37 IST

కీవ్‌: రష్యా చేస్తోన్న దురాక్రమణను (Russian invasion) అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌కు మొదటి నుంచి పాశ్చాత్య దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాటో కూటమి (NATO) భారీ స్థాయిలో సైనిక, ఆయుధ సహాయం చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు (Ukraine) హామీ ఇచ్చిన వాటిలో 98శాతం కంటే ఎక్కువ సాయుధ వాహనాలు, మందుగుండు సామగ్రి అందించినట్లు నాటో కూటమి వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సుమారు గంటపాటు మాట్లాడినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించిన మరుసటి రోజే నాటో నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘1500లకుపైగా సాయుధ వాహనాలతో పాటు 230 ట్యాంకులు, ఇతర పరికరాలు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి ఉక్రెయిన్‌కు అందించాం. తొమ్మిదికిపైగా ఉక్రెయిన్‌ బ్రిగేడ్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఆయుధాలు కూడా సమకూర్చాం. ఇలా 30వేలకుపైగా సైనికులతో ఈ కొత్త బ్రిగేడ్లు రూపొందించుకోనున్నాయి. ఇవి రష్యా ఆక్రమిత ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఉక్రెయిన్‌ను బలమైన స్థానంలో ఉంచుతుంది’ అని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు 31 నాటో దేశాల కూటమి నిబద్ధత కలిగి ఉందన్నారు. ఒకవేశ శాంతి చర్చలు జరిగితే కీవ్‌ను బలమైన స్థితిలో ఉంచేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.

మరోవైపు చైనా-ఉక్రెయిన్‌ అధ్యక్షుల మధ్య జరిగిన సంభాషణపై రష్యా తనదైన శైలిలో స్పందించింది. వారిద్దరి మధ్య సంభాషణ యుద్ధానికి ముగింపు పలుకనుందా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముగింపు పలకడంతోపాటు రష్యా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేసే ఎటువంటి ప్రయత్నాన్నైనా స్వాగతిస్తామని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. ఆ రెండు దేశాల మధ్య జరిగిన సంభాషణ మాత్రం వారి సొంత, ద్వైపాక్షిక చర్చలకు సంబంధించినవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని