Israel Hamas Conflict: గాజాలో వేలల్లో మరణాలు.. ఆ ‘డంబ్‌ బాంబ్స్‌’ కారణమా..?

Israel Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్‌ కురిపిస్తోన్న బాంబుల వర్షంతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. దీంతో ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

Updated : 14 Dec 2023 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరు (Israel-Hamas Conflict)తో గాజా వాసులు విలవిల్లాడిపోతున్నారు. దక్షిణ గాజాలో కూడా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పుడు అక్కడి ప్రజలకు కూడా సురక్షిత స్థానమంటూ లేకుండా పోయింది. ఫలితంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కచ్చితత్వం లేని ‘డంబ్‌ బాంబు’లను(dumb bombs) అధికంగా వాడటం కూడా ఇందుకు కారణం కావొచ్చని అమెరికా నిఘా సంస్థ నివేదిక అంచనా వేసింది. దీనిని నేషనల్ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్ కార్యాలయం రూపొందించిందని సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. 

ఇజ్రాయెల్‌(Israel) వైమానిక దాడుల్లో భాగంగా గాజాపై వినియోగిస్తున్న ఆయుధాల్లో కచ్చితత్వం లేని డంబ్‌బాంబుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకే అవి జనావాసాలపై పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటోంది. దాంతో భారీగా ప్రాణనష్టం సంభవించడానికి కారణమవుతోందని సదరు నివేదిక పేర్కొంది. గాజా లాంటి అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ ప్రాణనష్టం సాధారణం కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో ఉపయోగించిన 29వేల బాంబుల్లో 40-45 శాతం డంబ్‌ బాంబులే ఉన్నాయని పేర్కొంది. యూఎస్‌ అంచనాపై ఇజ్రాయెల్ సైన్యం(IDF) ప్రతినిధి స్పందిస్తూ.. ‘మేం ఏ తరహా ఆయుధాలు వాడుతున్నామో చెప్పం’ అని తెలిపారు.

గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా భారత్‌ ఓటు

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వరం మారిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇజ్రాయెల్‌ చేస్తున్న విచక్షణారహితంగా బాంబింగ్‌ను తప్పుపట్టారు. ఈ వైఖరి వల్లే ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ మద్దతు కోల్పోతోందని హెచ్చరించారు. దీర్ఘకాలిక పరిష్కారానికి సంకీర్ణ ప్రభుత్వం అడ్డు పడుతోందన్నారు. 

మమ్మల్ని ఏ ఒత్తిడి ఆపలేదు: నెతన్యాహు

ఒకవైపు తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా.. తమ సైన్యం గాజాలో పోరు కొసాగిస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. ‘చివరి వరకు మేం పోరాడుతాం. బాధతో ఈ విషయాన్ని చెప్తున్నాను. మమ్మల్ని ఏదీ ఆపదు. విజయం సాధించే వరకు మేం యుద్ధం కొనసాగిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో తక్షణ కాల్పుల విరమణ, బేషరుతుగా బందీల విడుదలను డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. 

ఒకవైపు హమాస్ ప్రతిఘటన కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయెల్‌ ఒకేసారి తొమ్మిది మంది సైనికులను కోల్పోయింది. ఇది ఐడీఎఫ్‌కు పెద్ద ఎదురుదెబ్బే. దీంతో ఇప్పటిదాకా 115 మంది ఇజ్రాయెల్‌ సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాకు చెందిన సుమారు 18వేల మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని