China-Nepal: బెల్ట్‌ అండ్‌ రోడ్‌పై చైనా-నేపాల్‌ చెట్టాపట్టాల్‌

బీఆర్‌ఐ (BRI) కింద నేపాల్‌ (Nepal)లో చైనా (China) చేపట్టిన ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి చైనా-నేపాల్‌ తాజా మరోసారి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

Published : 11 Jul 2023 17:19 IST

కాఠ్‌మాండూ/బీజింగ్‌: వివాదాస్పద బెల్ట్‌ అండ్ రోడ్‌ ఇనిషియేటివ్‌ ( BRI)లో భాగంగా నేపాల్‌ (Nepal)లో మౌలికవసతుల కల్పనకు చైనా(China) ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు నేపాల్‌ నేషనల్‌ ప్లానింగ్ కమిషన్‌ (NPC) ఛైర్మన్‌ డా. మిన్‌ బహదూర్‌ శ్రేష్ఠా, చైనా నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫార్మ్‌ కమిషన్‌ (NDRC) వైస్‌ ఛైర్మన్‌ చాంగ్ లియాంగ్ మధ్య సోమవారం బీజింగ్‌ వేదికగా జరిగిన సమావేశంలో ఒప్పందం జరిగినట్లు మై రిపబ్లిక్ న్యూస్‌ పోర్టల్‌ అనే వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై నేపాల్‌ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్‌ సంతకం చేసినట్లు తెలిపింది. మరోవైపు నేపాల్‌ ప్రధాని పుష్ప కుమార్‌ దహల్‌ ప్రచండ సెప్టెంబరులో చైనాలో పర్యటించనున్నారు.

ఈ సమావేశం సందర్భంగా.. ఇరుపక్షాలు ప్రాజెక్ట్‌ల పురోగతిపై చర్చించాయి. బీఆర్‌ఐ కింద గతంలో ఇరు దేశాల సరిహద్దుల అనుసంధానానికి చైనా ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నేపాల్‌లో చైనా చురుగ్గా పెట్టుబడులు పెడుతోంది. 2017, మేలో బీఆర్‌ఐ అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా సరిహద్దుల్లో రోడ్డు, రైల్వే, విమానయానం, విద్యుత్తు వంటి వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశం. 2013లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగ్నేయాసియాతోపాటు మధ్య ఆసియా, గల్ఫ్‌, ఆఫ్రికా, యూరప్‌ ప్రాంతాలను రోడ్డు, సముద్ర మార్గాల అనుసంధానించాలని చైనా భావిస్తోంది. 

ఇప్పటికే చైనా-పాక్‌ ఎకానమిక్‌ కారిడార్‌ (CPEC) కింద పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో 60 బిలియన్‌ డాలర్లతో ప్రాజెక్ట్‌లు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా బీఆర్‌ఐ ప్రాజెక్ట్‌ను తిరస్కరిస్తూ గతంలో భారత్ తన వైఖరిని వెల్లడించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల పేరుతో చిన్న దేశాలకు చైనా రుణాలు ఇస్తున్న తీరుపై కూడా భారత్‌ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని