నోట్ల రద్దు ఎఫెక్ట్‌.. బ్యాంకులపై నైజీరియన్ల దాడులు!

Nigeria demonetisation: నైజీరియాలో చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో నోట్ల మార్పిడికి మరో 60 రోజుల గడువు ఇచ్చింది.

Published : 17 Feb 2023 01:45 IST

అబుజ (నైజీరియా): పశ్చిమాఫ్రికా దేశం నైజీరియాలో (Nigeria) ప్రకటించిన నోట్లు రద్దు (Demonetisation) నిర్ణయంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నోట్ల మార్పిడికి విధించిన గడువు ముగియడం, తగిన నగదు అందుబాటులో లేకపోవడం పట్ల నైజీరియన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాంకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆందోళనలు ఉద్ధృతమవుతున్న వేళ పాత నోట్ల మార్పిడికి గడువు పొడిగిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు బుహారీ ప్రకటించారు. రెండు వారాల్లో ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి.

నైజీరియాలో 1000, 500, 200 నైరా (నైజీరియన్‌ కరెన్సీ) నోట్లను రద్దు చేస్తున్నట్లు అక్కడి సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. నోట్ల మార్పిడికి ఇప్పటికే ఓ సారి గడువు పొడిగించారు. ఫిబ్రవరి 10తో ఆ గడువూ ముగిసింది. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత రానుందని, మనీలాండరింగ్‌ వంటి మోసాలను అరికట్టొచ్చని నోట్ల రద్దు నిర్ణయాన్ని అధ్యక్షుడు సమర్థించుకున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో నోట్ల చలామణీ సైతం తగ్గుతుందని తెలిపారు.

నగదు కొరతపై ఆగ్రహం

పాత నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చినప్పటికీ కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. కొన్నిసార్లు పగలూ రాత్రీ వేచి చూసినా నగదు దొరకని పరిస్థితి నెలకొంది. నగదు మార్పిడికి పరిమితి విధించడం ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే నైజీరియాలోని దక్షిణ ప్రాంతంలో రెండు బ్యాంకులకు ఇటీవల ప్రజలు నిప్పు పెట్టారు. ప్రధాన రహదారులను నిర్బంధించారు. వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసి ఆందోళనలు నిర్వహించారు. దీంతో నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. నైజీరియాలోని ఇతర ప్రధాన నగరాల్లో చాలా వరకు వ్యాపార కార్యకలాపాలు మూతపడ్డాయి.

మరో 60 రోజుల గడువు

నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గ్రహించిన దేశాధ్యక్షుడు బుహారీ నోట్ల మార్పిడికి మరో 60 రోజుల గడువు ఇచ్చారు. ఆ మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌కు అనుమతి ఇచ్చారు. దీనిపై ప్రజల నుద్దేశించి గురువారం ప్రసంగించారు. ఏప్రిల్‌ 10 వరకు కొత్త 1000, 500, 200 నైరా నోట్లతో పాటు పాత 200 నైరా నోట్లూ చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. పాత 1000, 500 నోట్లు మాత్రం సెంట్రల్‌ బ్యాంక్‌, ఎంపిక చేసిన పాయింట్లు వద్ద మాత్రమే మార్చుకునేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఎన్నికల ముందు నిర్ణయం

నైజీరియా పార్లమెంట్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 25న తదుపరి అధ్యక్షుడిని అక్కడి ప్రజలు ఎన్నుకోనున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బుహారీ.. తాను పదవి నుంచి దిగిపోతానని ఇది వరకే ప్రకటించారు. ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. ప్రచారానికి నగదు దొరకడం కష్టంగా మారిందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని