Kim Jong Un-Putin : కిమ్‌, పుతిన్‌ మధ్య ఏ ఒప్పందమూ జరగలేదు!

ఉ.కొరియా (North Korea) నియంత కిమ్‌ (Kim Jong Un) రష్యాలో (Russia) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిమ్, పుతిన్‌ (Vladimir Putin) మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని క్రెమ్లిన్‌ పేర్కొంది.

Published : 15 Sep 2023 17:20 IST

మాస్కో: ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) రష్యా (Russia) పర్యటన సందర్భంగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎలాంటి అధికారిక ఒప్పందాలపై సంతకాలు చేసే ఆలోచనే ఇరు దేశాలకు లేదని ఆయన పేర్కొన్నారు. దాంతో కేవలం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin), కిమ్‌ మధ్య పరస్పర చర్చలు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ గత కొన్నేళ్లుగా ఎవరినీ ఖాతరు చేయకుండా స్వదేశంలో అణు పరీక్షలు చేయిస్తున్నారు. రకరకాల క్షిపణులను అభివృద్ధి చేసి వాటిని పరీక్షిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలోనే కిమ్‌ రష్యాలో పర్యటించడం.. అమెరికా సహా దాని మిత్ర దేశాలను ఆందోళనకు గురి చేసింది. ప్యాంగ్యాంగ్‌లో తయారైన క్షిపణులను మాస్కో సేకరిస్తుందేమోనని అవి అనుమానం వ్యక్తం చేశాయి. 

సుఖోయ్‌-35 ప్లాంట్‌కు కిమ్‌..!

ప్రస్తుతం రష్యాలోనే ఉన్న కిమ్‌ సుఖోయ్‌-35 యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్క్స్‌ ఆన్‌ అముర్‌ నగరంలోని విమాన తయారీ ప్లాంట్‌ రష్యాలోకెల్లా అతిపెద్దది. ఇక్కడ సుఖోయ్‌-35తోపాటు పలు రకాల యుద్ధ విమానాలను తయారు చేస్తారని రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ పేర్కొంది. మరోవైపు ఉత్తర కొరియాలో పర్యటించాలన్న ఆహ్వానాన్ని పుతిన్‌  (Putin) అంగీకరించారు. అంతేకాదు.. ఉత్తరకొరియా ఉపగ్రహ, అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు రష్యా తరపున సాయం చేయడానికి పుతిన్‌ సానుకూలత వ్యక్తం చేశారు.  అక్టోబర్‌లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ కూడా ప్యాంగ్యాంగ్‌ను సందర్శించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని