Belarus: ‘నోబెల్‌’ పురస్కార గ్రహీతకు 10 ఏళ్ల జైలు!

బెలారస్‌కు చెందిన హక్కుల న్యాయవాది, నోబెల్‌ పురస్కార గ్రహీత బియాలియాత్‌స్కీకి అక్కడి కోర్టు తాజాగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2021 జులై నుంచి జైల్లోనే ఉన్న ఆయనకు గతేడాది అక్టోబరులో నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

Published : 03 Mar 2023 22:09 IST

మిన్‌స్క్: హక్కుల న్యాయవాది, గతేడాది నోబెల్‌ శాంతి పురస్కారం(Nobel Peace Prize) దక్కించుకున్న బెలారస్‌కు చెందిన ఆలెస్‌ బియాలియాత్‌స్కీ(Ales Bialiatski)కి స్థానిక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించేలా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, స్మగ్లింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఓ కేసులో బియాలియాత్‌స్కీ(60)తోపాటు ఆయన స్థాపించిన హక్కుల సంస్థ ‘వియాస్నా(Viasna)’కు చెందిన మరో ముగ్గురిని  కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో వాలియన్సిన్ స్టెఫానోవిచ్‌కు తొమ్మిదేళ్లు, ఉలాద్జిమిర్‌ లాబ్కోవిక్జ్‌కు ఏడేళ్లు, జిమిత్రి సలాయుకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

బియాలియాత్‌స్కీ 1980ల్లో బెలారస్‌(Belarus)లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2020లో జరిగిన ఎన్నికల విషయంలో దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకోకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. బియాలియాత్‌స్కీతో పాటు అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. 2021 జులై నుంచి వీరు జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. సలాయు అప్పటికే బెలారస్ వదిలి వెళ్లిపోయారు. బియాలియాత్‌స్కీ జైల్లో ఉన్న సమయంలోనే గతేడాది అక్టోబరులో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి వరించింది.

ఇదిలా ఉండగా.. లుకాషెంకో తన పాలనలో నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. బెలారస్‌ ప్రతిపక్ష నేత స్వియాత్లానా సిఖానౌస్కాయ తాజా తీర్పును ఖండించారు. ‘ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు, వారిని విడిపించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి’ అని ఓ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని