North Korea: కిమ్‌ను భయపెడుతోన్న కరోనా.. పెను ‘ఉపద్రవం’ అన్న దేశాధినేత

గత రెండేళ్లుగా కరోనా ఊసే లేని ఉత్తర కొరియాలో ఇప్పుడు మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తున్నట్లే కన్పిస్తోంది. ఎన్నడూ లేనిది ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాస్క్‌లో కన్పించడం అక్కడి పరిస్థితులను ఉదహరిస్తోంది.

Published : 14 May 2022 11:36 IST

తాజాగా మరో 21 మంది మృత్యువాత

ఇంటర్నెట్‌డెస్క్‌: గత రెండేళ్లుగా కరోనా ఊసే లేని ఉత్తర కొరియాలో ఇప్పుడు మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తున్నట్లే కన్పిస్తోంది. ఎన్నడూ లేనిది ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాస్క్‌లో కన్పించడం అక్కడి పరిస్థితులను ఉదహరిస్తోంది. రెండు రోజుల క్రితం ఆ దేశంలో తొలి కొవిడ్‌ కేసు నమోదవ్వగా.. మరణాల లెక్కలు నానాటికీ పెరుగుతున్నాయి. శుక్రవారం మరో 21 మంది తీవ్ర జ్వరంతో ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీంతో రెండు రోజుల్లోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇవి కరోనా మరణాలా కాదా అన్న విషయాన్ని ఉత్తర కొరియా స్పష్టంగా చెప్పట్లేదు.

స్థానిక వార్తా సంస్థల గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ చివరి నుంచి అనూహ్యంగా జ్వరం వ్యాపించడం వల్ల 5.24లక్షల మంది అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో 2.43లక్షల మంది కోలుకోగా.. 2.80లక్షల మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో ఎంత మందికి కరోనా నిర్ధారణ అయ్యిందన్న విషయాలను మాత్రం ఉత్తర కొరియా వెల్లడించట్లేదు. వీరిలో కొంతమందికి పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు తెలిసిందట. ఇక మరణించిన వారిలోనూ ఒకరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తించినట్లు తెలుస్తోంది.

మందులు విరాళమిచ్చిన కిమ్‌‌..

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుండటంతో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శనివారం తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మహమ్మారి పరిస్థితులను చారిత్రక ఉపద్రవంగా కిమ్ అభివర్ణించారు. ఈ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఔషధాల సరఫరాపై చర్చించారు. దేశ అత్యవసర రిజర్వుల నుంచి మందులను విడుదల చేసి పంపిణీ చేయాలని కిమ్‌ సూచించారు. అంతేగాక, తన ప్రైవేటు మెడికల్‌ సప్లయ్స్‌లో నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

చైనా నుంచి నేర్చుకోండి..

కొవిడ్ కట్టడికి తక్షణ వ్యూహాలను అమలు చేయాలని కిమ్‌ అధికారులను సూచించారు. ఈ సందర్భంగా కరోనాను విజయవంతంగా కట్టడిచేస్తోన్న చైనా లాంటి దేశాలను చూసి నేర్చుకోవాలని చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేలా కఠిన ఆంక్షలను అమలు చేయాలని కిమ్‌ సూచించారు. అయితే అదే సమయంలో దేశ ఆర్థిక లక్ష్యాలు కూడా నెరవేరేలా చూడాలని, వ్యవసాయ, పరిశ్రమ, నిర్మాణ రంగాల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాలని కిమ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా యావత్‌ ప్రపంచాన్ని కరోనా వణికించినప్పటికీ ఉత్తరకొరియా మాత్రం తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెబుతూ వచ్చింది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని కొవాక్స్‌ కూటమి ముందుకొచ్చినా తమకు అవసరం లేదంటూ దూరం పెట్టింది. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చైనా నుంచి నేర్చుకోవాలని కిమ్‌ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే చైనా నుంచి కొవిడ్‌ సంబంధిత ఔషధాలు, టెస్టు కిట్‌లను ఉత్తర కొరియా కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు, ఇతర ఔషధాలు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ దేశం నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని దక్షిణ కొరియా చెబుతోంది.

ఏప్రిల్‌ చివర్లో ఉత్తరకొరియాలో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో పరేడ్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పటికీ మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలేవీ కనిపించలేదు. అప్పటినుంచే వేల మందిలో కొవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయని తెలుస్తోంది. అయితే బలహీన ఆరోగ్య వ్యవస్థ, వ్యాక్సిన్ల లేమి, పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఉత్తరకొరియా వైరస్‌ ఉద్ధృతి మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని