Artillery: ఉత్తర కొరియా దూకుడు.. శతఘ్నులతో భీకర గర్జన!

వరుస క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలుస్తోన్న ఉత్తర కొరియా(North Korea).. తాజాగా శతఘ్నులతో విరుచుకుపడింది! తన తూర్పు, పశ్చిమ తీరాల నుంచి ఏకంగా 130 రౌండ్లకుపైగా ఫిరంగి గుండ్లను సముద్రంలోకి పేల్చినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.

Published : 06 Dec 2022 01:05 IST

సియోల్‌: వరుస క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలుస్తోన్న ఉత్తర కొరియా(North Korea).. తాజాగా శతఘ్నులతో విరుచుకుపడింది! తన తూర్పు, పశ్చిమ తీరాల నుంచి ఏకంగా 130 రౌండ్లకు పైగా ఫిరంగి గుండ్లను సముద్రంలోకి పేల్చినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇరు దేశాల సరిహద్దు సమీపంలోనే ఈ మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టినట్లు ఆరోపించింది. కొన్ని షెల్స్‌ ‘బఫర్ జోన్‌’లో పడ్డాయని, 2018నాటి సమగ్ర సైనిక ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించినట్లేనని విమర్శించింది. ఈ క్రమంలోనే శతఘ్నుల వినియోగంపై ఆ దేశానికి పలు హెచ్చరికలు పంపినట్లు దక్షిణ కొరియా(South Korea) రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు.. ఈ వ్యవహారంపై కిమ్‌ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ, సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ICBM) సహా వరుస మిసైల్‌ ప్రయోగాలు చేపట్టింది. యుద్ధ విమానాల విన్యాసాలు, ఇతరత్రా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మరోవైపు, ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లూ సైతం ఈ ఏడాది మిలిటరీ డ్రిల్స్‌ను వేగవంతం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని