North Korea: ఆసియా నాటో ఏర్పాటుకు అమెరికా సాకులు..!

ఆసియాలో నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా యత్నాలు చేస్తోందని ఉత్తరకొరియా విమర్శించింది. ఇటీవల దక్షిణ కొరియా, జపాన్‌లతో అమెరికా సైనిక సహకారాన్ని

Published : 04 Jul 2022 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియాలో నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా యత్నాలు చేస్తోందని ఉత్తరకొరియా విమర్శించింది. ఇటీవల దక్షిణ కొరియా, జపాన్‌లతో అమెరికా సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. సైనిక కూటమి ఏర్పాటు ప్రణాళికలో ఇదొక భాగమని  ఆరోపించింది. ‘‘ఉత్తరకొరియా నుంచి మప్పు పొంచి ఉందంటూ అమెరికా ప్రచారం చేయడం వెనుక ఉన్న వాస్తవిక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా-పసిఫిక్‌లో సైనిక ఆధిపత్యాన్ని సాధించడమే దాని ఉద్దేశం’ అని ఉ.కొరియా ప్రతినిధి పేర్కొన్నారు. రక్షణ పరంగా వేగంగా మారుతున్న పరిణామాలకు అనుకూలంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

గత వారం నాటో సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, దక్షిణ కొరియా ప్రధాని యూన్‌ సుక్‌ యోల్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమం కేవలం కొరియా ద్వీపకల్పానికే కాకుండా మొత్తం తూర్పు ఆసియా, ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని ఓ అంగీకారానికి వచ్చారు. ఉత్తరకొరియాను అదుపు చేసే చర్యలను మరింత తీవ్రం చేస్తామని వారు పేర్కొన్నారు. ‘‘అమెరికా-జపాన్‌, అమెరికా-దక్షిణ కొరియాల కూటములు శత్రు దేశాల దుందుడుకు చర్యలను కట్టడి చేసే సామర్థ్యాలను మెరుగు పర్చుకోవాలి. దీనిలో భాగంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా మధ్య త్రిముఖ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలి’’ అని కిషిదా పేర్కొన్నారు. 

1910 నుంచి 45 వరకు జపాన్‌ దళాలు కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు దక్షిణ కొరియా-జపాన్‌ల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. ద.కొరియా మాజీ అధ్యక్షుడు మూన్‌జే ఇన్‌ హయాంలో ఇవి తీవ్రమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఇంటెలిజెన్స్‌ పంచుకోవడంపై ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఇరు దేశాధినేతలు అంగీకరించారు.

ఈ ఏడాది ఉత్తరకొరియా భారీ సంఖ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అదే సమయంలో మరోసారి అణు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని