Prince Harry: ప్రిన్స్‌ హ్యారీ పిల్లలకు రాయల్‌ హోదా!

ప్రిన్స్ హ్యారీ(Prince Harry), మేఘన్‌ (Meghan Markle) దంపతుల కుమారుడు ఆర్చీ, కుమార్తె లిలిబెట్‌లకు రాజకుంటుంబ వారసులుగా గుర్తిస్తూ.. రాయల్‌ ఫ్యామిలీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. 

Published : 10 Mar 2023 00:05 IST

లండన్‌: ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry), మేఘన్‌ మార్కెల్‌ (Meghan Markle) పిల్లలను రాజకుటుంబం వారసులుగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ (Buckingham Palace) గుర్తించింది. ఈ మేరకు గురువారం వారికి ప్రిన్స్‌, ప్రిన్సెస్‌ హోదా కల్పించించింది. ఇకపై వారిని ప్రిన్స్‌ ఆర్చీ, ప్రిన్సెస్‌ లిలిబెట్‌గా పిలుస్తారు. అంతకుముందు తమ పిల్లలకు ప్రిన్స్‌, ప్రిన్సెస్‌ హోదాలతో నామకరణం చేస్తున్నట్లు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ దంపతుల కుమారుడు ఆర్చీ, కుమార్తె లిలిబెట్‌లకు రాజకుంటుంబ వారసులుగా గుర్తిస్తూ.. రాయల్‌ ఫ్యామిలీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. దీంతో వీరు రాజకుటుంబ సింహాసనం వారసుల జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు.

రెండేళ్ల క్రితం ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ను రాచరిక హోదాను వదులుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వారు రాజకుంటుంబానికి దూరంగా  అమెరికాలో కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఆ సమయంలో తమ పిల్లల్ని మాత్రం రాజకుంటుంబ సంప్రదాయాలతోనే పెంచుతామని వెల్లడించారు. ఇప్పటి వరకు వీరిని మాస్టర్‌ ఆర్చీ, మిస్‌ లిలిబెట్‌లుగా పిలుస్తున్నారు. ఇకపై వీరి పేర్లకు ముందు ప్రిన్స్‌, ప్రిన్సెస్‌ చేరనున్నాయి. బ్రిటన్‌ రాజకుటుంబం నిబంధనల ప్రకారం చక్రవర్తి మనుమడు, మనుమరాలు.. యువరాణి, యువరాజు కావచ్చు. దాని ప్రకారమే ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ రాజకుటుంబ హోదా వదులుకున్నప్పటికీ.. వారి పిల్లలకు రాచరిక హోదా కల్పించారు. గతంలో తమ పిల్లలకు రాజరిక హోదా కల్పించేందుకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నిరాకరించిందని మేఘన్‌ ఆరోపించింది. 

ప్రిన్స్‌ హ్యారీ ఇటీవలే స్పేర్‌ (Spare) పేరుతో తన జీవిత చరిత్రను రాశారు. ఇందులో రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు బయటపెట్టారు. తన తండ్రి కింగ్‌ ఛార్లెస్‌, సవతి తల్లి కెమిల్లా, అన్నయ ప్రిన్స్ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్‌ మార్కెల్‌ను రాజకుటుంబం వేదనకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌ హ్యారీ పిల్లలను రాజకుటుంబ వారసులుగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌  గుర్తించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని