Rishi- Akshata: వంట విషయంలో రిషికే ఎక్కువ మార్కులు..: అక్షతామూర్తి

రిషి సునాక్‌ చక్కగా వంట చేస్తారని ఆయన సతీమణి అక్షతామూర్తి కితాబిచ్చారు. పిల్లల హోంవర్క్‌ బాధ్యతలు తనవేనని చెప్పారు.

Published : 06 Mar 2024 00:36 IST

లండన్‌: వంట విషయంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) తన సతీమణి అక్షతామూర్తి (Akshata Murty) నుంచి మంచి మార్కులు కొట్టేశారు. ఆయన చక్కగా వంట చేస్తారని ఆమె కితాబిచ్చారు. తనకూ పాకశాస్త్రమంటే ఆసక్తేనని చెప్పారు. అయితే, ఈ విషయంలో రిషికే ఎక్కువ నైపుణ్యం ఉందన్నారు. ప్రధానిగా బాధ్యతలు ఎక్కువైన కారణంగా ఇప్పుడు వంటగదిలో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకడం లేదని సునాక్‌ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరిద్దరూ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తమ దైనందిన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇద్దరిలో రిషి ఓ క్రమపద్ధతిలో ఉంటారని, తరచూ బెడ్‌రూంలోకి వచ్చి బెడ్‌ను పొందిగ్గా సర్దుతుంటారని అక్షత చెప్పారు. తాను ఉదయాన్నే లేచే వ్యక్తిని కాదని చెప్పగా.. ‘‘బెడ్‌ సర్దడం కూడా నీకు ఇష్టం ఉండదు. అది నన్ను బాధిస్తుంది’’ అని సునాక్‌ సరదాగా వ్యాఖ్యానించారు. “ఇద్దరం స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా.. నేను మంచం మీదే భోజనం చేసి, ప్లేట్లు అక్కడే వదిలిపెట్టేదాన్ని. అది చూసి రిషి విసుక్కొనేవారు. ఆయనతో పోలిస్తే నేను అంత క్రమపద్ధతి గల వ్యక్తిని కాదు’’ అని అక్షత చెప్పుకొచ్చారు. ‘ఫ్రెండ్స్’ టీవీ షో అంటే ఇద్దరికీ ఇష్టమని, నిద్రపోయే ముందు ఆ ఎపిసోడ్‌లు చూస్తూ రిలాక్స్‌ అవుతుంటామన్నారు.

సామాన్య పౌరుడిలా కమర్షియల్‌ ఫ్లైట్‌లో ప్రధాని ప్రయాణం

కుమార్తెలు కృష్ణ, అనౌష్కల హోమ్‌వర్క్ బాధ్యతలు అక్షత తీసుకోగా.. మిగిలిన వాటిని సునాక్‌ చూసుకుంటారు. “స్కూల్‌కు సంబంధించిన విషయాల్లో నేను కఠినంగా ఉంటాను. అవి పక్కాగా సాగడం అవసరం. పిల్లలతో హోంవర్క్ చేయిస్తాను. వారు చదువుతున్నారా? లేదా? అని ఓ కంట కనిపెడుతుంటాను’’ అని ఆమె తెలిపారు. రోజువారీ షెడ్యూల్‌లో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి తనకే ఎక్కువ వీలు చిక్కుతుందన్నారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే రన్నింగ్‌కు సమయం లభిస్తుందని రిషి చెప్పారు. ఇదిలా ఉండగా.. 2022 అక్టోబరులో రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని