Flight: సామాన్య పౌరుడిలా కమర్షియల్‌ ఫ్లైట్‌లో ప్రధాని ప్రయాణం

అధికారిక పర్యటనల్లో భాగంగా ఒక దేశ ప్రధాని తనకు కేటాయించిన విమానంలో కాకుండా కమర్షియల్ ఫ్లైట్‌(Flight)లో ప్రయాణించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 05 Mar 2024 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక దేశ ప్రధాని సామాన్యుడిలా కమర్షియల్ ఫ్లైట్‌(Flight)లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. న్యూజిలాండ్‌ పీఎం కిస్టోఫర్ లగ్జన్‌ ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఉన్నతస్థాయి సమావేశాల కోసం ఇలా ప్రయాణం చేయాల్సి వచ్చింది.

షెడ్యూల్ ప్రకారం.. లగ్జన్ మంగళవారం ఉదయం ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో న్యూజిలాండ్ డిఫెన్స్‌ ఫోర్స్‌కు చెందిన బోయింగ్ 757 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆయన దేశీయ సంస్థ ఎయిర్‌ న్యూజిలాండ్‌కు చెందిన విమానంలో మెల్‌బోర్న్‌ చేరుకున్నారు. లగ్జన్‌ రాజకీయాల్లోకి రాకముందు ఎయిర్‌ న్యూజిలాండ్ సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం.

ప్రధాని పర్యటనల కోసం రెండు బోయింగ్ 757 విమానాలను కేటాయించారు. ఒక దానిలో సాంకేతికలోపం తలెత్తగా.. రెండో దానిలో షెడ్యూల్‌ ప్రకారం తనిఖీలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రయాణికుల విమానంలో వెళ్లిన ప్రధాని బుధవారం తిరిగి రానున్నారు. అప్పటికల్లా రాయల్ న్యూజిలాండ్ ఎయిర్‌ఫోర్స్‌ అధికారిక విమానాన్ని సిద్ధం చేయాల్సిఉంది. ఇదిలాఉంటే.. ఆసియన్‌-ఆస్ట్రేలియా సదస్సులో పాల్గొనేందుకు క్రిస్టోఫర్ ఈ పర్యటనకు వెళ్లారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని