10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు రిషి.. ఆయనకున్న విలాస భవంతులెన్నో తెలుసా..?

యూకే కొత్త ప్రధాని రిషి అధికారిక నివాసంలోకి మారనున్నారు. అయితే ఆయనకు పలు విలాస భవంతులున్నాయి. 

Published : 27 Oct 2022 18:25 IST

లండన్‌: కోటీశ్వరుడైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ తనకున్న ఎన్నో విలాసవంతమైన భవనాలను వదిలి.. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అంతకు ముందు బోరిస్‌ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన అందులోనే నివసించారు. ఈ విషయాన్ని ఆ సెక్రటరీ ధ్రువీకరించారు. దీనికంటే 11 డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ విశాలంగా ఉంటుంది. కానీ రుషి మాత్రం 10లో ఉండాలనుకుంటున్నారు. ఎందుకు ఆయన దాన్నే ఎంచుకున్నారని అడగ్గా.. ‘వారక్కడ అంతకుముందు సంతోషంగా ఉన్నారు ’ అని ప్రతినిధి సమాధానమిచ్చారు. 

రిషి సునాక్‌ సతీమణి అక్షతా మూర్తి.. దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె. ఆమె కూడా ఆ సంస్థలో వాటాదారు. దాంతో రిషి, అక్షత ఇద్దరి ఆస్తుల విలువ కలిపి 730 మిలియన్ల పౌండ్లుగా ఉంది. వారికి బ్రిటన్‌, విదేశాల్లో కలిపి నాలుగు ఇళ్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ 15 మిలియన్ల పౌండ్లు. 

అందులో న్యూయార్క్‌షైర్‌లో ఉన్న భవంతి విలువ 6.6 మిలియన్ల పౌండ్లు. ఇది నాలుగు అంతస్తుల్లో ఉంది. సునాక్‌ కుటుంబం వారాంతాలు ఇక్కడికే వెళ్తుంది. అలాగే రిషి నియోజకవర్గం అయిన రిచ్‌మండ్‌లోని కిర్బీ సిగ్‌స్టన్‌లో గ్రేడ్‌-2 లిస్టెడ్‌  జార్జియన్ మానర్ హౌస్ ఉంది. ఇది వీరి ఇల్లు.  దీని విలువ రెండు మిలియన్ల పౌండ్లు. అలాగే యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో  శాంటా మోనికా ప్రాంతంలో పెంట్‌హౌస్‌ అపార్ట్‌మెంట్ ఉంది. బ్రిటన్‌లో ఇళ్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు వివాహం తర్వాత రిషి జంట ఇక్కడే ఉన్నారట. ఇంకా వీరికి లండన్‌లోని ఒక ఫ్లాట్ ఉంది. ఇది 2001లో రిషి ఉద్యోగం చేస్తున్న సమయంలో కొనుగోలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని