Russia vs US: అమెరికా జైలు నుంచి బయటకొచ్చిన ‘మృత్యు వ్యాపారి’..!
ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర, వేర్పాటువాద సంస్థలకు ఆయుధాలు సరఫరా చేసిన విక్టర్ బౌట్(Viktor Bout)ను అమెరికా విడుదల చేయాల్సి వచ్చింది.
ఇంటర్నెట్‌డెస్క్: అతడో ఆయుధ వ్యాపారి.. ప్రపంచంలోని ఉగ్ర, వేర్పాటువాద సంస్థలకు ఆయుధాలు విక్రయిస్తుంటాడు. అతడికి రష్యా (Russia) పూర్తి మద్దతు ఉంది. అతడి వద్ద భారీ సంఖ్యలో సొంత రవాణా విమానాలు ఉన్నాయి. వాటిల్లోనే ప్రపంచం నలు మూలలకు ఆయుధాలను చేరవేస్తాడు. అతడి అక్రమ ఆయుధ వ్యాపారంపై ఏకంగా ‘ఘోస్ట్‌రైడర్’ చిత్ర హీరో నికోలస్ కేజ్‌తో ‘లార్డ్ ఆఫ్ వార్’ చిత్రాన్ని నిర్మించారంటే అర్థం చేసుకోవచ్చు. అతడి పేరు విక్టర్ బౌట్(Viktor Bout)..! అతికష్టంపై అమెరికా(USA) 2008లో అతడిని అరెస్టు చేసింది. కానీ, ఇప్పుడు రష్యా(Russia)తో చేసుకున్న ఓ డీల్‌లో భాగంగా అతడిని జైలు నుంచి విడుదల చేసింది.
రష్యా (Russia) ఒత్తిడికి బైడెన్ సర్కారు తలొగ్గింది. మృత్యువ్యాపారి(merchant of death)గా పేరున్న విక్టర్ బౌట్(Viktor Bout)ను అప్పగించి.. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టై రష్యా (Russia) జైల్లో ఉన్న అమెరికన్ విమెన్స్ నేషనల్ బాస్కెట్ బాల్ స్టార్ బ్రిట్నీగ్రినెర్ (brittney griner) ను విడిపించుకొంది. ఈ డీల్ అమలు చేయడానికి యూఏఈలోని అబుదాబి విమానాశ్రయం వేదికగా మారింది. ఈ డీల్‌పై బైడెన్ మాట్లాడుతూ..‘‘ బ్రిట్నీ మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఆమె కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రినెర్ (brittney griner) వద్ద గంజాయి తైలం ఉండటంతో మాస్కో విమానాశ్రయంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
సౌదీ-యూఏఈ మధ్యవర్తిత్వం..
మరోవైపు అమెరికా (USA) జైల్లో ఉన్న విక్టర్ బౌట్(Viktor Bout)ను నిన్న అర్ధరాత్రి అధికారులు హఠాత్తుగా నిద్రలేపి.. ‘నీకు అంతా కలిసొచ్చింది’ అంటూ.. తీసుకొచ్చి రష్యన్లకు అప్పగించారు. వాషింగ్టన్ నుంచి ఓ ప్రైవేటు విమానంలో బౌట్‌ను అబుదాబి తీసుకొచ్చారు. మాస్కో నుంచి మరో ప్రైవేట్ జెట్ గ్రినెర్(brittney griner)ను తీసుకొని అక్కడకు చేరుకొంది. విమానాశ్రయంలోనే వీరిద్దరని పరస్పరం మార్చుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను రష్యా(Russia) ప్రభుత్వ రంగ మీడియా సంస్థలు విడుదల చేశాయి. అమెరికా(USA) -రష్యా(Russia) మధ్య ఈ డీల్ కుదిర్చేందుకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్), యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఆయా దేశాల విదేశాంగ విభాగాలు పేర్కొన్నాయి. కానీ, వాషింగ్టన్ దీనిని అంగీకరించలేదు. అమెరికా-రష్యాలే చర్చించుకొన్నాయని పేర్కొంది.
ఎవరీ బౌట్..?
55ఏళ్ల విక్టర్ బౌట్(Viktor Bout) గతంలో సోవియట్ సైన్యంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. 1967 తజఖిస్థాన్‌లో పుట్టిన బౌట్ సోవియట్ మిలటరీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెన్ లాంగ్వేజస్‌ను చదివాడు. సోవియట్ పతనం తర్వాత అంతర్జాతీయ రవాణా వ్యాపారిగా మారాడు. ఆ తర్వాత ఆయుధ వ్యాపారిగా మారి ఉక్రెయిన్ తదితర ప్రాంతాల నుంచి ఆయుధాలను ప్రపంచంలోని నలువైపులా విక్రయించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర, రెబల్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. ఇతడి ఆపరేషనల్ నెట్‌వర్క్ అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాక్, సూడాన్, అంగోలా, కాంగో, లైబీరియా, ఫిలిప్పీన్స్, రువాండా, సియార్రో లియోన్‌కు విస్తరించింది. సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ జీఆర్‌యూ సహకారంతో ఓ స్టార్టప్ మొదలుపెట్టాడు. విక్టర్‌కు సొంతగా పెద్దసంఖ్యలో విమానాలున్నాయి. తొలి మూడు విమానాలు జీఆర్‌యూ సమకూర్చింది. ఇతడి వద్ద యాంటినోవ్, ఇల్యూషన్, యకోవ్‌లెవ్ రకం కార్గో విమానాలు ఉన్నాయి. వీటిని వాడుకొని పలు రకాల యుద్ధ క్షేత్రాలకు ఆయుధాలను తరలించాడు. అమెరికా(USA)లో ట్విన్ టవర్స్ పేల్చివేత జరిగే వరకు విక్టర్ భారీగా ఆయుధాలను విక్రయించేవాడు.
ఐరాస సేవలకు కూడా..
విక్టర్ వద్ద ఉన్న విమానాలు నిత్యం ఆఫ్రికా, ఆసియా.. ఇలా పలు ప్రాంతాల్లో తిరిగేవి. 2005లో అమెరికా(USA) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ కీలక నివేదిక ఇచ్చింది. అతడి విమానాలు ట్యాంకులు, హెలికాప్టర్లు, టన్నుల కొద్దీ ఆయుధాలను ప్రపంచంలోని ఏమూలకైనా చేరవేయగలవని పేర్కొంది. ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని సోమాలియాకు చేర్చడానికి, ఐరాస ఆహార సాయాన్ని కాంగోకు చేర్చడానికి కూడా విక్టర్ (Viktor Bout)విమానాలు వినియోగించారు. అల్‌ఖైదా, తాలిబన్లతో సంబంధాలున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
సినీ ఫక్కీలో అరెస్టు..
ఆయుధ డీలర్ బౌట్ అరెస్టు ఏ హాలీవుడ్ సినిమాకు తీసిపోదు. 2006లో అమెరికా అతడికి ఉన్న 30 డొల్ల కంపెనీల్లో 12 సంస్థల ఆస్తులను స్తంభింపజేసింది. అమెరికన్లతో లావాదేవీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. కానీ, అతడి పరపతి కారణంగా అరెస్టు చేయలేదు. 2008లో పరిస్థితులు మారాయి. ఆ ఏడాది అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు థాయ్‌లాండ్‌లో వేసిన ఉచ్చులో అతడు పడ్డాడు. అధికారులు కొలంబియాకు చెందిన ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్ రూపంలో అతడివద్ద ఆయుధ కొనుగోళ్లకు వెళ్లారు. కొలంబియాలోని అమెరికా హెలికాప్టర్ల కూల్చివేతకు అవసరమైన ఆయుధాలు ఇచ్చేందుకు కూడా అతడు అంగీకరించాడు. దీంతో అతడిని 2008 మార్చిలో అరెస్టు చేయగా.. 2010లో అమెరికాకు తరలించారు. 2012లో అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌కు వందల కొద్దీ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్స్‌ను, 20,000 ఏకే 47లను అమ్మేందుకు అంగీకారం కుదుర్చుకున్నందుకు ఈ శిక్ష విధించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
World News
America: ‘మెంఫిస్’ ఘటన ఎఫెక్ట్.. పోలీసు ప్రత్యేక విభాగం రద్దు!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Crime News
Video: ట్రాలీబ్యాగ్‌లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీ తరలింపు.. ఎలా బయటకు లాగారో చూడండి!
-
India News
Indian Railways: ముంబయి- అహ్మదాబాద్ రైలు మార్గం.. 622 కి.మీల మేర కంచె నిర్మాణం!
-
Sports News
IND vs NZ: ‘వంద’ కోసం చెమటోడ్చిన టీమ్ఇండియా.. రెండో టీ20లో విజయం