Russia: ప్రపంచం పుతిన్‌ను చంపాలనుకుంటోంది : జెలెన్‌స్కీ

పుతిన్‌కు ప్రాణభయం పెరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వాగ్నర్‌ ప్రైవేటు సైన్యం చావు దెబ్బతిందని పేర్కొన్నారు. 

Published : 02 Jul 2023 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ దేశంపై యుద్ధం కారణంగా రష్యా (Russia) కిరాయి సైన్యం వాగ్నర్‌ (Wagner) గ్రూప్‌ తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్‌(Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రపంచం పుతిన్‌ను చంపాలనుకుంటోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్పెయిన్‌ ప్రధాని కీవ్‌ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ స్పానిష్‌ పత్రికలతో మాట్లాడుతూ.. ‘‘ఈ యుద్ధంలో కిరాయి సైన్యం భారీగా నష్టపోయింది. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్‌ సైనికులను హతమార్చాయి. మరో 80,000 మంది ఆ గ్రూప్‌ సైనికులు గాయపడ్డారు. వాగ్నర్‌ పీఎంసీ భారీగా నష్టపోయింది. రష్యా సైన్యం ప్రేరేపిత మూకగా మేము వారిని చూస్తాం. వారంతా ఖైదీలు.. వారి వద్ద కోల్పోవడానికి ఏమీ లేదు’’ అని వెల్లడించారు. పుతిన్‌పై వాగ్నర్‌ బాస్‌ ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేసిన వారం తర్వాత జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా ఓ విలేకరి మీకు ప్రాణభయం లేదా..? అని జెలెన్‌స్కీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితి నాకంటే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కేవలం రష్యాలో మాత్రమే నన్ను చంపాలనుకుంటున్నారు. కానీ, ప్రపంచం మొత్తం పుతిన్‌ను చంపాలనుకుంటోంది’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. 

12 రోజుల తర్వాత మళ్లీ ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా..!

దాదాపు 12 రోజుల వ్యవధి తర్వాత రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్‌పై డ్రోన్లు దాడి చేసిన విషయాన్ని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. కాకపోతే తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ వాటిని కూల్చివేసిందని వెల్లడించింది. ‘‘మరోసారి శత్రువులు కీవ్‌పై దాడి చేశారు. కానీ, ఈ సారి ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం లేదు’’ అని కర్నల్‌ జనరల్‌ సెర్హీ పాప్కోవ్‌ టెలిగ్రామ్‌ ఛానెల్‌లో వెల్లడించారు. స్పెయిన్‌ ప్రధాని పర్యటన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని