Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 73 మంది సజీవదహనం

దక్షిణాఫ్రికా (South Africa)లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Updated : 31 Aug 2023 16:12 IST

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా (South Africa)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అతిపెద్ద నగరమైన జొహన్నెస్‌బర్గ్‌ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 73 మంది సజీవదహనమయ్యారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

జొహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ భవనంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాగా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.

అనైతిక కార్యకలాపాలకు వేదికగా రోబో ట్యాక్సీలు..!

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 73 మృతదేహాలను గుర్తించామని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధికారులు వెల్లడించారు. మరో 52 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

నిరాశ్రయులు ఎలాంటి లీజ్‌ అగ్రిమెంట్లు లేకుండానే ఈ భవనంలో నివాసముంటున్నారని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని వెతకడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ భవనంలో దాదాపు 200 మంది నివాసముంటున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి భవనం చాలా వరకు ధ్వంసమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని