Sri Lanka Crisis: శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది....

Updated : 03 Apr 2022 15:08 IST

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీంతో వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం-ఆదివారం మధ్యరాత్రి నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనలను అణచివేయడానికే పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

సంక్షోభ నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ వివిధ ప్రజాసంఘాలు శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. వీటి నియంత్రణకు ఉపక్రమించిన అక్కడి ప్రభుత్వం 36 గంటల అత్యవసర పరిస్థితి విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై కూడా నిషేధం విధించడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడించారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని