Updated : 27 May 2022 13:02 IST

School Shooting: 11 ఏళ్ల చిన్నారి ఒంటికి రక్తం పూసుకుని.. చనిపోయినట్లు నటించి..!

‘‘డాడ్‌.. మా టీచర్‌ను, ఫ్రెండ్స్‌ను చంపేశారు. నన్నూ చంపేస్తాడేమోనని భయం వేసింది. వెంటనే ఒంటికి రక్తం పూసుకుని కింద పడిపోయా. చనిపోయినట్లు నటించా. ఆ తర్వాత అతడు క్లాస్‌ నుంచి వెళ్లిపోయాడు’’.. టెక్సాస్‌ మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ 11 ఏళ్ల చిన్నారి తన తండ్రికి చెప్పిన మాటలివి. యువాల్డీ పట్టణంలోని రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో ఓ దుండగుడు చిన్నారులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు మియా సెరిల్లో అనే చిన్నారి చేసిన ఆలోచన ప్రతి హృదయాన్ని కలచివేస్తోంది.

మియా రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే గత మంగళవారం కూడా ఆనందంగా పాఠశాలకు వెళ్లింది. ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకొంటూ టీచర్లు చెప్పే పాఠాలు వింటోంది. సరిగ్గా అదే సమయంలో ఊహించని ఘటన.. ముక్కూమొహం తెలియని ఓ వ్యక్తి గన్‌ పట్టుకుని క్లాస్‌రూంలోకి వచ్చాడు. చూస్తుండగానే అందర్నీ పిట్టల్లా కాల్చేస్తున్నాడు. అది చూసిన మియా భయంతో వణికిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే టీచర్‌ ఒంట్లోకి తూటా దూసుకెళ్లి చనిపోయింది. ఆ వెంటనే మియా ఫ్రెండ్‌ కూడా కుప్పకూలింది. ఇక తననూ చంపేస్తాడేమో అని ఆ చిన్నారి గజగజలాడింది. వెంటనే చనిపోయిన తన స్నేహితురాలి శరీరంపై ఉన్న రక్తాన్ని తన శరీరంపై చల్లుకుంది. కిందపడి చనిపోయినట్లు నటించింది. ఆ తర్వాత ఆ ఆగంతకుడు క్లాస్‌రూం నుంచి బయటకి వెళ్లగానే.. టీచర్‌ చేతిలో ఫోన్‌ తీసుకుని 911 నంబరుకు ఫోన్‌ చేసింది.

స్కూల్లో కాల్పుల ఘటన గురించి తెలియగానే మియా తండ్రి మిగుల్‌ సెరిల్లో పాఠశాలకు చేరుకున్నారు. అదే సమయంలో రక్తపు మరకలతో ఉన్న మియాను పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే మిగుల్ గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి కుమార్తెను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించినా పోలీసులు అంగీకరించలేదు. ఆమెను స్కూల్‌ బస్సులోకి ఎక్కించారు. దీంతో మిగుల్‌.. బస్సు కిటికీ వద్దకు వెళ్లి మియాతో మాట్లాడాడు. అప్పుడు ఆ చిన్నారి క్లాస్‌రూంలో జరిగిందంతా తండ్రికి చెప్పింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు తాను ఎలా నటించిందో వివరించింది. తన కుమార్తె ప్రాణాలతో బయటపడటంతో ఆ తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు.

కాల్పుల ఘటనలో మియాకు స్వల్ప గాయాలవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. సాయంత్రానికి చిన్నారి తన తల్లిదండ్రుల వద్దకు చేరింది. అయితే కళ్లముందే మారణహోమాన్ని చూసిన మియా తీవ్ర భయాందోళనకు గురైంది. రాత్రంతా ఏడుస్తూనే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ‘‘డాడ్‌.. నువ్వు కూడా తుపాకీ తెచ్చుకో. ఆ గన్‌మెన్‌ మళ్లీ వస్తాడు’’ అంటూ మియా భయంతో చెబుతుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని మిగుల్‌ ఆవేదనగా చెప్పాడు. ఇదే పాఠశాలలో మియా చెల్లి కూడా రెండో తరగతి చదువుతోంది. కాల్పుల్లో ఆ చిన్నారి కూడా ప్రాణాలతో బయటపడింది.

రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని తీవ్రంగా కదిలిస్తోంది. సాల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏళ్ల యువకుడు గత మంగళవారం ఉదయం స్కూల్‌లోకి చొరబడి విచక్షణారహితగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు విషయం తెలియగానే స్కూల్‌ వద్దకు చేరుకున్న పోలీసులు.. నిందితుడిని మట్టుబెట్టారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts