Ship: మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు

సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ నీట మునిగింది. సముద్రపు నీరు భారీగా నౌకలోకి చేరడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో 31 మంది గల్లంతయ్యారు.

Published : 19 Dec 2022 11:47 IST

బ్యాంకాక్‌: గల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌ (Gulf of Thailand)లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్‌ యుద్ధ నౌక (Warship) ప్రమాదవశాత్తూ నీట మునిగింది. ఈ ఘటనలో 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. వారి కోసం నౌకలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్‌ (Thailand)లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌ ఆదివారం సాయంత్రం గస్తీ విధుల్లో పాల్గొంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరి విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. సమాచారమందుకున్న థాయ్‌ నౌకాదళం.. ఆ యుద్ధనౌక వద్దకు మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. వారు అక్కడకు చేరుకుని మొబైల్‌ పంపింగ్‌ మిషన్లను నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యపడలేదు. ఇంజిన్‌ వ్యవస్థ పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడంతో మరింత నీరు నౌక లోపలికి వచ్చింది. దీంతో నెమ్మదిగా నౌక ఓ వైపు ఒరుగుతూ నీటమునిగింది.

ప్రమాద సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మంది నావికులను సహాయక సిబ్బంది కాపాడగా.. మరో 31 మంది కోసం నిన్న అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలిస్తున్నారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్‌ నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని