ఎన్నికల ముందు.. బిడ్డకు జన్మనిచ్చిన పీఎం అభ్యర్థి..!

థాయ్‌లాండ్‌లో ప్రధాని పదవికి పోటీ పడుతోన్న పేటోంగ్టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra) రేసులో ముందున్నారు. రెండువారాల్లో ఎన్నికలనగా ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు.  

Published : 01 May 2023 19:01 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌(Thailand)లో రెండువారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఫలితాల్లో తదుపరి ప్రధాని ఎవరో తేలనున్నారు. ఈ సమయంలో పీఎం పోస్టుకు గట్టి పోటీ ఇస్తోన్న పేటోంగ్టార్న్ షినవత్రా( Paetongtarn Shinawatra) ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె దేశ ప్రజలకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

ఆమె థాయ్‌ మాజీ ప్రధాని తక్షిన్‌ షినవత్రా చిన్న కుమార్తె. 15 ఏళ్ల క్రితం ఆమె తండ్రి స్థాపించిన ఫ్యూ థాయ్‌ పార్టీ(Pheu Thai Party) తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల రేసులో ముందువరుసలో ఉన్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే తన చివరిపేరు షినవత్రా కూడా ఆమెకు కలిసొస్తుందని తెలుస్తోంది. ఆ కుటుంబానికి ఉత్తర, ఈశాన్య థాయ్‌లాండ్‌ గ్రామీణ ఓటర్ల మద్దతు ఉంది. రెండువారాల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆమె బిడ్డకు జన్మినిచ్చారు. ఈ చిత్రాలను ఈ రోజు ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. నిండు గర్భిణీగా ఉన్న సమయంలోనూ వీడియో కాల్స్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, మద్దతుదారులతో మాట్లాడటం మానలేదు. ప్రస్తుతం ఆమె ఫ్యూ పార్టీకి హెడ్. ఆమె వయస్సు 36 సంవత్సరాలు. 

2001 నుంచి 2006 వరకు తక్షిన్‌ షినవత్రా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సోదరి ఇంగ్లక్‌ షినవత్రా 2011 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. వీరిద్దరు థాయ్‌ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. తమపై నమోదైన అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. 

విదేశాల్లో ఉన్న తక్షిన్‌ ప్రస్తుతం స్వదేశానికి రావాలని భావిస్తున్నారని ఓ అంతర్జాతీయ కథనం వెల్లడించింది. తిరిగివస్తే.. అవినీతి కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. శిక్ష పడినా సరే తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని ఆయన భావిస్తున్నారట. ‘నాకిప్పుడు ఏడుగురు మనవలు/మనవరాళ్లు. నేను విదేశంలో ఉన్నప్పుడే వీరంతా జన్మించారు. నా వయస్సు 74. వారిని పెంచేందుకు నేను స్వదేశం రావడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని తక్షిన్‌ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 

అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా ఎన్నికల మీదే ఉందని, తన తండ్రి తిరిగి రావడం గురించి కాదని పేటోంగ్టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra) వెల్లడించారు. మరోపక్క ఒకవేళ ఆమె ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. మిలిటరీ నియమించిన 250 సెనెటర్ల మద్దతు పొందుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రధాని ఎన్నికలో ఈ నియమిత సెనెటర్లది కీలక పాత్ర.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని