Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్‌-రే’ చూస్తే షాక్‌!

కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి వైద్యులు ఎక్స్‌రే తీయించగా.. అతడి పొట్టలో 15 సెం.మీల పొడవైన చాకు కనిపించింది.

Published : 22 Sep 2023 01:51 IST

ఖాఠ్‌మాండూ: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిని పరిశీలించిన వైద్యులకు ఊహించని అనుభవం ఎదురైంది. కారణం అతడి పొట్టలో ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకు (Knife Blade) కనిపించింది. ఆ పదునైన వస్తువు కారణంగా బాధితుడి అంతర్గత అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. నేపాల్‌ (Nepal)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ‘క్యూరియస్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

నేపాల్‌కు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, అతడిలో వికారం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలేవి కనిపించలేదు. రక్త స్థాయిలు సాధారణంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడి శరీరాన్ని పరిశీలించగా.. పొట్ట కుడిభాగంలో కుట్లు వేసి ఉన్న గాటు కనిపించింది. ఏం జరిగిందని వైద్యులు ప్రశ్నించగా.. అంతకుముందు రోజు గొడవ జరిగిందని, ఈ క్రమంలో గాయమైందని తెలిపాడు.

భారత్‌తో విభేదాలు.. ఆ ‘ఐదు కళ్ల’నే నమ్ముకొన్న ట్రూడో..!

దీంతో వైద్యులు ‘ఎక్స్‌-రే’ తీయించగా.. పొట్టలో 15 సెం.మీల పొడవైన చాకు ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువును తొలగించారు. ఆ చాకు ఒక వైపు నుంచి మరొక వైపునకు తిరిగినప్పటికీ.. పొట్ట భాగంలోని అవయవాలు ఏవీ తీవ్రంగా దెబ్బతినలేదని వైద్యులు తెలిపారు. 

చాకు పొడిచినప్పుడు పెద్ద గాయమేమీ కాకపోవడం, పైగా మద్యం మత్తులో ఉండటంతో ఏం జరిగిందో బాధితుడు గుర్తించలేకపోయినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఘటన జరిగిన రోజు స్థానికంగానే ఓ ఆరోగ్య కార్యకర్త అతడి గాయానికి కుట్లు వేసినట్లు పేర్కొంది. తరువాతి రోజు పొట్ట భాగంలో అసౌకర్యంగా అనిపించడంతో అతడు వైద్యుల వద్దకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని