Five Eyes Alliance: భారత్‌తో విభేదాలు.. ఆ ‘ఐదు కళ్ల’నే నమ్ముకొన్న ట్రూడో..!

Five Eyes intelligence alliance: భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసి ఉద్రిక్తతలు రాజేసిన కెనడా.. మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రూడో చూపంతా ‘ఫైవ్‌ ఐస్‌’ కూటమిపైనే ఉంది. అసలీ కూటమి ఏంటీ..?

Updated : 21 Sep 2023 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ అంశంపై భారత్‌ ఆందోళనలను కెనడా (Canada) పట్టించుకోవడంలేదు సరికదా.. ఇప్పుడు అసంబద్ధంగా నిందలేస్తూ దిల్లీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ (India) హస్తం ఉండొచ్చని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే ఆధార రహితంగా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో భారత్‌ను నిందించాలని ప్రయత్నిస్తున్న కెనడా.. మద్దతు కూడగట్టుకునేందుకు మిత్ర దేశాల బృందమైన ‘ఫైవ్‌ ఐస్ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ (Five Eyes intelligence  Alliance)’ వైపు ఆశగా చూస్తోంది. ఇంతకీ ఏంటా కూటమి..? భారత్‌-కెనడా ఉద్రిక్తతలపై ఆ దేశాలు ఏమంటున్నాయి..? (India Canada Diplomatic Row)

రెండో ప్రపంచ యుద్ధం గెలుపుతో..

రెండో ప్రపంచ యుద్ధం విజయంలో ఇంటెలిజెన్స్‌ సహకారం కీలక పాత్ర పోషించిందని గుర్తించిన అమెరికా, యూకే.. 1946లో విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం UKUSA ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ కూటమిని రెండు సార్లు విస్తరించారు. అలా 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్‌ (New Zealand) దేశాలు కూడా ఇందులో చేరి ‘ఫైవ్‌ ఐస్ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌’గా రూపాంతరం చెందింది. ఇందులోని రెండు దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా.. భారత్‌, జపాన్‌తో కలిసి ఇటీవల క్వాడ్‌ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

‘ఫైవ్‌ ఐస్‌’ కూటమితో ప్రయోజనమేంటీ..?

ఈ కూటమిలోని సభ్య దేశాలకు చెందిన నిఘా ఏజెన్సీలు.. అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం పనిచేస్తాయి. ఈ దేశాలు పరస్పరం సమాచార సేకరణలో సహకరించుకోవడం, కీలక విషయాలు పంచుకోవడం వంటివి చేస్తాయి. మానవ మేధ, భద్రతాపరమైన విశ్వసనీయ సమాచారం, సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌, భౌగోళిక-అంతరిక్ష నిఘా సమాచారం, రక్షణ రంగానికి చెందిన నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటాయి. సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే.. మొబైల్ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌, రాడార్‌, ఆయుధ వ్యవస్థల కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్స్‌ సిగ్నళ్లను సేకరిస్తాయి. ఇక ఉపగ్రహ చిత్రాల ద్వారా అందిన డేటాను కూడా ఇవి షేర్‌ చేసుకుంటాయి. దీంతో పాటు ఈ ఐదు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా ఉంటాయి. ఈ ఐదు ఆంగ్లభాషను ప్రధానంగా మాట్లాడే దేశాలే కావడం విశేషం.  

జీ20కి ముందే కూటమిని ఆశ్రయించిన ట్రూడో..?

ఖలిస్థానీ అంశంపై భారత్‌తో కొనసాగుతున్న వివాదం వేళ కెనడా.. ఈ కూటమి నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే జీ20 సదస్సు జరగడానికి కొద్ది వారాల ముందు నిజ్జర్‌ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ‘ఫైవ్‌ఐస్‌ గ్రూపు’ దేశాలను కెనడా కోరినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కూటమి నిఘా విభాగ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నాయి. అయితే, అమెరికా సహా మిగతా దేశాలు కూడా అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సదరు కథనాలు తెలిపాయి. కాగా.. ఈ వార్తలను కెనడా ఖండించింది. ఆ వార్తలన్నీ కల్పితమని, తాము ఆ దేశాలను అభ్యర్థించలేదని పేర్కొంది.

ఆచితూచి స్పందిస్తున్న సభ్య దేశాలు..

ఇప్పుడు ట్రూడో ఆరోపణలతో భారత్‌, కెనడా మధ్య విభేదాలు మరింత భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ట్రూడో సర్కారు మరోసారి ‘ఫైవ్‌ ఐస్‌’ కూటమి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ భారత్‌-కెనడా ఉద్రిక్తతలపై సభ్యదేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. 

  • ‘‘భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి, ఆందోళనకరమైనవి. కెనడా దర్యాప్తు ప్రయత్నాలకు మేం మద్దతిస్తున్నాం. ఈ దర్యాప్తునకు భారత్‌ కూడా సహకరించాలని కోరుతున్నాం’’ అని అమెరికా సూచించింది.
  • ‘‘ఈ వార్తలు ఆందోళనకరం. ఈ అంశాన్ని మేం భారత్‌ వద్ద ప్రస్తావించాం. దీనిపై దర్యాప్తు జరగాల్సి ఉన్నందున ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేం’’ అని ఆస్ట్రేలియా చెబుతోంది.
  • ‘‘కెనడావి తీవ్రమైన ఆరోపణలు. దీనిపై మేం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అయితే, ఈ పరిణామాలు భారత్‌-యూకే మధ్య వాణిజ్య చర్చలపై ఎలాంటి ప్రభావం చూపవు’’ అని యూకే వెల్లడించింది.
  • ‘‘కెనడా చేస్తున్న ఆరోపణలు నిజమని రుజువైతే.. తప్పకుండా అది ఆందోళనకర అంశమే. దీనిపై ఇంతకంటే మాట్లాడబోం’’ అని న్యూజిలాండ్‌ తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని