Omicron Scare: చైనాలో ఒమిక్రాన్‌ కలవరం.. మూడు నగరాల్లో లాక్‌డౌన్‌!

జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. అతిపెద్ద నగరాలైన షియాన్‌, టియాంజిన్‌లలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అన్యాంగ్‌ నగరంలోనూ లాక్‌డౌన్‌ విధించింది.

Published : 12 Jan 2022 01:39 IST

వైరస్‌ కట్టడికి కఠిన ఆంక్షలు

బీజింగ్‌: కొవిడ్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు వెలుగు చూడడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతోన్న వేళ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం చైనాకు సవాలుగా మారింది. జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. అతిపెద్ద నగరాలైన షియాన్‌, టియాంజిన్‌లలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అన్యాంగ్‌ నగరంలోనూ లాక్‌డౌన్‌ విధించింది. దీంతో చైనాలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌ విధించిన నగరాల సంఖ్య మూడుకు చేరింది.

చైనాలోని సెంట్రల్‌ హెనాన్‌ ప్రావిన్సుకు చెందిన అన్యాంగ్‌ నగరంలో 84 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కేవలం రెండు రోజుల్లోనే 58 కేసులను గుర్తించారు. వీటిలో ఎక్కువభాగం స్థానికంగా వ్యాప్తి చెందినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. వీటిలో కొన్నింటికి టియాంజిన్‌ మునిసిపాలిటీకి చెందిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తులతో సంబంధముందని అనుమానిస్తున్నారు. దీంతో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ తోపాటు భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులు నిర్వహించేందుకు గానూ నగరం మొత్తం లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. దాదాపు 55లక్షల జనాభా కలిగిన నగరంలో ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అత్యవసర సేవలు మినహా వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పర్యాటక కేంద్రాలుగా పేరొందిన షియాన్‌ నగరంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా, టియాంజిన్‌లో పాక్షిక లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కోటికి పైగా జనాభా కలిగిన ఆయా నగరాల్లో ప్రజలందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపడుతున్నారు.

ఇక చైనాలో మంగళవారం ఒక్కరోజే 200కేసులు బయటపడినట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. వీటిలో 110 కేసులు స్థానికంగానే వ్యాప్తి చెందాయని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 3458 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 21 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. 2019లో వుహాన్‌లో కరోనా వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 4636 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. తాజాగా పలు నగరాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడడం, స్థానికంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగడంతో భారీ స్థాయిలో టెస్టింగ్‌, ట్రేసింగ్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలను చైనా అధికారులు అమలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని